Andhra Pradesh: కర్ణాటకలో కాంగ్రెస్ కి ప్రచారం చేస్తున్న ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబుని సస్పెండ్ చేయాలి: బీజేపీ
- కర్ణాటకలో కాంగ్రెస్ కు ప్రచారం చేస్తున్న అశోక్ బాబు
- మండిపడుతున్న బీజేపీ నేతలు
- ఉద్యోగ సంఘాల నాయకుడా? టీడీపీ అధికార ప్రతినిధా?
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ నేతలు మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన అశోక్ బాబుకు కర్ణాటక రాష్ట్రంలో ఏం పని? అని ప్రశ్నించారు. అశోక్ బాబుపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కేవీ లక్ష్మీపతిరాజా డిమాండ్ చేశారు.
బెంగళూరులో టీడీపీ నిర్వహించిన తెలుగు సంఘాల సమావేశంలో అశోక్ బాబు పాల్గొని బీజేపీని ఓడించి..కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. అశోక్ బాబు ఉద్యోగ సంఘాల నాయకుడా? లేక టీడీపీ అధికార ప్రతినిధా? అని ప్రశ్నించారు. ఆ పదవిలో నుంచి అశోక్ బాబును ఉద్యోగ సంఘాలు తొలగించాలని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోక్యం చేసుకోవాలని, విచారణ నిర్వహించి అశోక్ బాబుని సస్పెండ్ చేయాలని కోరారు. ఈవిషయమై ప్రభుత్వం తగు చర్యలు చేపట్టకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని .. టీడీపీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా కర్ణాటకలో బీజేపీ విజయం తథ్యమని అన్నారు.