Jagan: ఇలా ప్రభుత్వం వ్యవహరిస్తే మనుషులు మృగాళ్లు కాక ఏమవుతారు?: ఏపీలో అత్యాచార ఘటనలపై జగన్‌

  • మహిళల, ఆడపిల్లల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవట్లేదు
  • ఇటువంటి ఘటనలు ఎన్నో జరిగాయి
  • ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేస్తే చర్యలు తీసుకోలేదు
  • చంద్రబాబు పాలనలో నాలుగేళ్లు ఏం జరిగాయో గుర్తుతెచ్చుకోండి

ప్రభుత్వం మహిళల, ఆడపిల్లల కష్టాలు పట్టించుకోనప్పుడు, తనను ఎవ్వరూ ఏమీ చేయలేరని మనిషి బరితెగించినప్పుడు ఏ వ్యక్తయినా మృగం అవుతాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. ఇటీవల గుంటూరు జిల్లా దాచేపల్లిలో ఓ బాలికపై మృగాడు అఘాయిత్యానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో పాటు ఏపీలో జరిగిన దారుణాలపై జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ఆయన కృష్ణా జిల్లా పెడనలో నిర్వహించిన పాదయాత్రలో మాట్లాడుతూ... నిందితులకు ఏపీ సహకరిస్తోంది కాబట్టే ఇలా మృగాళ్లు రెచ్చిపోతున్నారని ఆరోపించారు.

ఎమ్మార్వో వనజాక్షి తన పని తాను సక్రమంగా చేస్తోంటే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేశారని, ఆయనపై ఒక్క కేసు కూడా నమోదు చేయకుండా చంద్రబాబు ఆయనను కాపాడారని జగన్ అన్నారు. ర్యాగింగ్‌ భరించలేక రిషితేశ్వరి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంటే నిందితుల పట్ల చట్టాలు చుట్టాలుగా వ్యవహరించేలా చంద్రబాబు చేశారని ఆరోపించారు.

కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్‌లో టీడీపీ నేతలు ఉన్నారని, వారిపై చర్యలు తీసుకోలేదని, ఆ కేసును అధిక వడ్డీ కేసులుగా మార్చేశారని జగన్ అన్నారు. కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా? అంటూ చంద్రబాబు వెక్కిలి నవ్వులు నవ్వారని, ఇటువంటి ఎన్నో ఘటనలకు ప్రభుత్వమే పాల్పడుతుంటే మనుషులు మృగాళ్లు కారా? అని జగన్ నిలదీశారు.

గుంటూరులో నాలుగు రోజుల్లో ఒక్క నెలలోనే 11 అత్యాచార ఘటనలు వెలుగులోకొచ్చినప్పటికీ ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేకపోతే మనుషులు మృగాలుగా మారరా? అని జగన్‌ ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలపై, చిన్నారులపై దారుణాలు పెరిగిపోతున్నాయని అన్నారు. అలాగే, రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని.. బడి, గుడి, ఇంటికి వెళ్లే దారుల్లో మద్యం షాపులు పెడుతున్నారని, అది తాగుతూ మనిషి మృగంగా మారుతున్నాడని అన్నారు. ఒక్కసారి నాలుగేళ్ల చంద్రబాబు నాయుడి పాలనని గుర్తు తెచ్చుకోవాలని జగన్‌ పిలుపునిచ్చారు. 

  • Loading...

More Telugu News