Telangana: రేపటి వరకు ఏపీ, తెలంగాణల్లో ఈదురుగాలులు తప్పవు : ఐఎండీ
- 40 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం
- ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తుంది
- 5 నుంచి 10 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదు కావచ్చు
- ఐఎండీ అధికారులు
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. రేపటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈదురుగాలులు తప్పవని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారులు హెచ్చరించారు. తెలంగాణలోని వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, సిద్దిపేట, కొమురం భీం జిల్లాల్లో, ఏపీలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయగోదావరి జిల్లాల్లో గంటలకు 40 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తుందని హెచ్చరించింది. 5 నుంచి 10 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నట్టు పేర్కొంది. చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ కింద ప్రజలెవరూ నిలబడొద్దని సూచించింది.
ఇదిలా ఉండగా, కృష్ణా జిల్లాలో భారీ వర్షాలపై అధికారులతో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉన్నందున జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని, పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. విద్యుత్, మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.