Hyderabad: మాదాపూర్‌లో అండర్ పాస్ ప్రారంభం.. వచ్చేనెల 1న ఎల్బీనగర్లో కూడా
- హైదరాబాద్‌లో ట్రాఫిక్ జామ్ సమస్యలకు కళ్లెం
- 5న రూ.1500 కోట్లతో నిర్మించనున్న స్కై వేలకు శంకుస్థాపన
- రూ.23 వేల కోట్లతో ఎస్ఆర్డీపీ పనులు
- వివరించిన కేటీఆర్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు తాము రూ.23 వేల కోట్లతో ఎస్ఆర్డీపీ పనులు చేపట్టామని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. తాము పూర్తి చేయాలనుకున్న పనులు పెట్టుకున్న లక్ష్యానికన్నా ముందుగానే పూర్తి చేస్తామని తెలిపారు. ఈ రోజు హైదరాబాద్ మాదాపూర్‌లోని మైండ్ స్పేస్ కూడలిలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్మించిన అండర్ పాస్ నిర్మాణం పూర్తి కావడంతో ఈ రోజు తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు మహేందర్ రెడ్డి, కేటీఆర్ కలిసి దానిని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... తాము వచ్చేనెల 1న హైదరాబాద్ ఎల్బీనగర్లోని చింతల్‌కుంట అండర్ పాస్‌ను కూడా ప్రారంభిస్తామని చెప్పారు. అంతేగాక, వచ్చే నెల 5న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా రూ.1500 కోట్లతో నిర్మించనున్న స్కై వేలకు శంకుస్థాపనలు జరగనున్నట్లు పేర్కొన్నారు.