Andhra Pradesh: పెద్ద నోట్ల రద్దు నాటి పరిస్థితులే ప్రస్తుతం నెలకొన్నాయి: సీఎం చంద్రబాబు

  • ఒకటో తారీకు వస్తోందంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది
  • బ్యాంకులు ఇలా వ్యవహరిస్తే ఎలా ?
  • రాష్ట్రంలో నగదు కొరతకు కారణాలు ఏంటో చెప్పాలి

పెద్ద నోట్ల రద్దు నాటి పరిస్థితులే ప్రస్తుతం నెలకొన్నాయని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఒకటో తారీకు వస్తోందంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొందని, బ్యాంకులు ఇలా వ్యవహరిస్తే సంక్షేమ కార్యక్రమాలు ఎలా అమలు చేయాలి? రాష్ట్రంలో నగదు కొరతకు కారణాలు ఏంటో చెప్పాలి? అని ప్రశ్నించారు. ఈ సమస్యను ఎలా అధిగమించాలో బ్యాంకర్లు ఆలోచించాలని చంద్రబాబు సూచించారు.

ఈ రోజు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు చెబుతూ, బ్యాంకర్లు ఇబ్బందికర వాతావరణం సృష్టించారని, ఏ బ్యాంకు అయినా ఇబ్బందుల్లో ఉంటే డిపాజిటర్ల డబ్బు వాడుకుంటాం అనే సంకేతాలు పంపారని, ఈ విధానం వల్లే ఇబ్బందులు తలెత్తాయని అన్నారు. రేపు మరో రూ.500 కోట్లు నేరుగా ఆర్బీఐ ప్రింటింగ్ ప్రెస్ నుంచి వస్తున్నాయని చెప్పారు.

కాగా, ఏపీలో నగదు కొరతపై బ్యాంకర్ల సమావేశంలో వాడీవేడీ చర్చ జరిగింది. నగదు కష్టాలను ఎందుకు అధిగమించలేకపోతున్నారంటూ భారతీయ రిజర్వ్ బ్యాంక్ అధికారులను మంత్రి యనమల రామకృష్ణుడు, ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ప్రశ్నించారు. నగదు కొరతతో వృద్ధి రేటు 2 శాతం పడిపోయిందని, బ్యాంకుల్లో నగదు కొరతను నివారించాలని యనమల డిమాండ్ చేశారు.

ప్రభుత్వాలపై నోట్ల రద్దు ప్రభావం ఉందని, దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలనుకుంటోందో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. ఆర్థిక కార్యకలాపాలు స్తంభిస్తే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. బ్యాంకర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని మరో రూ. 5 వేల కోట్లు పంపాలని ఆర్బీఐని కోరామని చెప్పారు. బ్యాంకులు, ఏటీఎంలలో నగదు ఉండటం లేదని, రూ.200 నోట్లు, రూ.100, రూ.200 నోట్లను అందుబాటులో ఉంచాలని కోరారు.  

నగదు లభ్యతలో ఎటువంటి ఇబ్బందులు లేవు: ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు

నగదు లభ్యతలో ఎటువంటి ఇబ్బందులు లేవని ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు స్పష్టం చేశారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత తెలుగు రాష్ట్రాలకే ఎక్కువ నగదు పంపామని, ఎనబై శాతం ఏటీఎంలు పనిచేస్తున్నాయని, ఇప్పటి వరకు 82 వేల కోట్ల విలువ చేసే కొత్త నోట్లు అందించామని, మరో రూ.20 వేల కోట్లు అవసరమని ఆర్బీఐ అధికారులు చెప్పారు. హైదరాబాద్ ఆర్బీఐ రీజనల్ ఆఫీసుకి దేశంలోనే అత్యధికంగా కరెన్సీ సరఫరా చేశామని చెప్పారు.

రియల్ ఎస్టేట్ ఆఫీసుల్లో భారీగా చేతులు మారుతున్న డబ్బులు?
 
కాగా, బ్యాంకుల్లో నగదు కొరతపై ఇన్ కంట్యాక్స్ అధికారులు దృష్టి సారించారు. రియల్ ఎస్టేట్ ఆఫీసుల్లో భారీగా డబ్బులు చేతులు మారుతున్నట్టు సమాచారం.  ఎస్ఆర్ నగర్, జూబ్లీహిల్స్ లోని రియల్ ఎస్టేట్ కార్యాలయాల్లో ఇన్ కంట్యాక్స్ అధికారులు సోదాలు నిర్వహించినట్టు తెలుస్తోంది. రూ.5.50 కోట్లు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు సంబంధిత వర్గాల సమాచారం.

  • Loading...

More Telugu News