BJP: బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు.. ప్రకటనే తరువాయి?

  • అధ్యక్ష పదవికి చివరి వరకు రేసులో నిలిచిన కన్నా, వీర్రాజు
  • వీర్రాజుకే ఓటేసిన అధిష్ఠానం
  • నేడు ప్రకటించే అవకాశం

టీడీపీ అనగానే అంతెత్తున లేచి విరుచుకుపడే బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుకే అధ్యక్ష పీఠం అప్పగించాలని అధిష్ఠానం దాదాపు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే నేడే ఆ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అధ్యక్ష పదవి కోసం పోటీలో నిలిచిన కన్నా లక్ష్మీనారాయణకు నిరాశ ఎదురు కావడంతో ఆయన పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్టు సమాచారం.

ప్రత్యేక హోదా విషయంలో ఏపీని బీజేపీ మోసం చేసిందన్న భావన ప్రజల్లోకి బలంగా వెళ్లిపోవడంతో ఆ పార్టీ నేతలు ఎన్ని చెబుతున్నా ప్రజలు విశ్వసించడం లేదు. ఈ నేపథ్యంలోనే ఎంపీ కంభంపాటి హరిబాబుతో అధ్యక్ష పదవికి రాజీనామా చేయించారు. హరిబాబు స్థానంలో కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నియమించాలని నిర్ణయించింది. దీంతో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ మంత్రులు పైడికొండల మాణిక్యాలరావు, కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణలలో ఎవరినో ఒకరిని అధ్యక్షుడిగా నియమించాలని నిర్ణయించినట్టు తెలిసింది.

మాణిక్యాలరావు వైపు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ మొగ్గు చూపారు. ఈ మేరకు ఢిల్లీ పిలిపించి మాట్లాడారు కూడా. అయితే, పార్టీని బలోపేతం చేసేందుకు తన వద్ద తగిన నిధులు లేవని చెప్పడంతో ఆయన నియామకం అక్కడితో ఆగిపోయింది. తనకు అవకాశం ఇవ్వాలని ఆకుల కోరినా, జూనియర్ కావడంతో ఆయనను పక్కనపెట్టారు. కన్నాకు ఉన్న సీనియారిటీ దృష్ట్యా ఆయనకే అధ్యక్ష పదవి ఇవ్వాలని అధిష్ఠానం భావించింది. అయితే వీర్రాజు అలక పూనడంతో ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు.

పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేస్తున్నట్టు చెబుతూ అధిష్ఠానం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు అధ్యక్ష పదవి అప్పగిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావించిన పార్టీ పెద్దలు చివరికి వీర్రాజుకే పట్టం కట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది.

More Telugu News