Andhra Pradesh: ఒకరి చెప్పు చేతల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం పని చేసే సమస్యే లేదు: సీఎం చంద్రబాబు
- కేంద్రం తీరుపై విరుచుకుపడ్డ చంద్రబాబు
- ఇచ్చిన హామీలు నెరవేర్చమని ఎంతగానో కోరాం
- ఢిల్లీ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోలేదు
- చివరగా పోరాటానికి దిగాం
ఒకరి చెప్పుచేతల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం పని చేసే సమస్యే లేదని చెప్పి ప్రజలందరికీ హామీ ఇస్తున్నానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడలో ధర్మపోరాట దీక్ష విరమించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ఏపీకి అన్యాయం చేస్తున్న కేంద్రం తీరుపై ఆయన విరుచుకుపడ్డారు.
‘తెలుగులో ఒక సామెత ఉంది.. సామ, దాన, భేద, దండోపాయాలని అన్నారు. సామం..మంచిగా, స్నేహంగా ఉండి సాధించుకోవడం. అందుకే, ఓ సీనియర్ నాయకుడిగా మంచిగా ఉండాలనుకుని 29 సార్లు ఢిల్లీ కెళ్లి ప్రయత్నం చేశాను. దానం.. ఏదైనా ఇచ్చి సాధించుకోవడం. ఆరోజున ప్రధాన మంత్రి గారు ఇక్కడికి వస్తే.. నేను ఆయన్ని ఏ విధంగా ఆహ్వానించానో మీరందరూ చూశారు. ఆ విధంగా నేను ఆయన్ని ఎందుకు ఆహ్వానించానంటే.. మనకు సమస్యలు లేకుండా చూసి, మన పనులు చేస్తారనే ఉద్దేశంతో చాలా తగ్గాను.
భేదం.. స్నేహంగా ఉన్నాం. అయినా కేంద్రం వినే పరిస్థితిలో లేదు. లాలూచీ రాజకీయాలు చేసింది. ఎవరైతే అవినీతి ఆరోపణలు ఉండి..ఒక కళంకిత రాజకీయపార్టీ వైఎస్ ఆర్ రాజకీయ పార్టీతో మీరు (బీజేపీ) లాలూచీ పడి ఈ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని నేను బహిరంగంగానే చెప్పాను. వాళ్లకు(బీజేపీ) అది కావాలి. మంచి ఇమేజ్ ఉన్న వాళ్లతో పెట్టుకుంటే ఎప్పటికైనా ఇబ్బంది వస్తుందనో, లేకపోతే మనం వాళ్ల (బీజేపీ) మాట వినమనో..తమిళనాడు మాదిరిగా ఈ ప్రభుత్వాన్ని తమ చెప్పుచేతల్లో పెట్టుకోవాలని అనుకున్నారు. నా చరిత్రలో ఒకరి చెప్పుచేతల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం పని చేసే సమస్యే లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కేంద్రం వినలేదు. ఇక చివరకు.. పోరాటం తప్ప వేరే మార్గం లేదని చెప్పి, ఈ రోజున పోరాటానికి సిద్ధమైన పార్టీ తెలుగుదేశం’ అని చెప్పుకొచ్చారు.