: కుర్చీ కోసం ఢిల్లీకి సిద్ధరామయ్య
కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేసులో ముందున్న సిద్ధరామయ్య ఈ రోజు సాయంత్రం అధినేత్రి సోనియాతో ఢిల్లీలో భేటీ కానున్నారు. ఇందుకోసం అయన మేడం అపాయింట్ మెంట్ కోరారు. తాను ముఖ్యమంత్రి పదవికి రేసులో ముందున్నానని బుధవారం ఫలితాల అనంతరం స్వయంగా సిద్ధరామయ్య ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధిష్ఠానం ఆశీస్సులతో కుర్చీ కైవసం చేసుకోవాలని ఆయన ప్రయత్నిస్తున్నారు.
వాస్తవానికి అభ్యర్థుల ఎంపిక సమయంలో కాంగ్రెస్ అధిష్ఠానం సిద్ధరామయ్యకే ప్రాధాన్యం ఇచ్చింది. దీంతో ముఖ్యమంత్రి పదవి ఆయనకే దక్కవచ్చని అంటున్నారు. మరోవైపు దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత మల్లికార్జున పేరు కూడా వినిపిస్తోంది. తాజాగా కేంద్రమంత్రి, మాజీ ముఖ్యమంత్రి మొయిలీ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశమై ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే దానిపై చర్చించనుంది.