Andhra Pradesh: హరిబాబు రాజీనామాపై స్పందించిన విష్ణుకుమార్ రాజు

- ఆయన రాజీనామా సాంకేతికాంశం
- పదవీ కాలం పూర్తయినందునే రాజీనామా
- హరిబాబు సమర్థవంతుడు
- కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని అడుగుతున్నాం
ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నిన్న సాయంత్రం కంభంపాటి హరిబాబు రాజీనామా చేయడాన్ని ఓ సాంకేతికాంశంగా ఆ పార్టీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. ఆయన పదవీ కాలం పూర్తి అయినందునే పార్టీ నియమాలకు కట్టుబడి రాజీనామా చేశారని ఆయన అన్నారు. ఈ ఉదయం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. హరిబాబు రాజీనామా వెనుక ఎటువంటి రాజకీయ కోణాలూ లేవని అన్నారు.
ఆయన సమర్థవంతుడైన నాయకుడని, ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని తాము కోరుతున్నామని తెలిపారు. గతంలోనూ పార్టీ పెద్దలతో హరిబాబుకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని ప్రస్తావించామని, ఆయన రాజీనామాతో విశాఖ రైల్వే జోన్ కు ఎటువంటి ఢోకా ఉండదని అన్నారు. కచ్చితంగా విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ వచ్చి తీరుతుందని తెలిపారు.