Chandrababu: మొదటి నుంచీ నీతిగా ఉన్నాం.. అది నచ్చకే నాకు చంద్రబాబు సీటు నిరాకరించి ఉండవచ్చు!: యలమంచిలి రవి
- నీతి, న్యాయంతో మా కుటుంబం రాజకీయాలు చేసింది
- ఆ విషయమే చంద్రబాబుకు నచ్చలేదు
- నా తండ్రి విజయవాడ అభివృద్ధి కోసం ఎంతో చేశారు
- ఆ పరంపరనే నేనూ కొనసాగించాను
సగటు మనిషికి అభివృద్ధి ఫలాలు చేరాలంటే అది ఒక్క వైసీపీ పాలనలోనే సాధ్యపడుతుందని మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి అన్నారు. ఈ రోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మాజీ శాసన సభ్యుడు, తెలుగుదేశం నేత యలమంచిలి రవి తన సహచరులు, అనుచరులతో పాటు వైసీపీలో చేరారు. తమ పార్టీ కండువాను యలమంచిలికి కప్పిన జగన్ ఆయనను వైసీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. రవి చేరిక బెజవాడలో పార్టీకి సరికొత్త ఉత్సాహం తీసుకు వచ్చిందన్నారు.
ఇక వారధి నుండి యలమంచిలి రవి జగన్ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిట్టి నగర్ సెంటర్లో జరిగిన బహిరంగ సభలో యలమంచిలి మాట్లాడుతూ... తొలి భేటీతోనే జగన్ పట్ల అచంచల విశ్వాసం కలిగిందన్నారు. రానున్న రోజుల్లో ఆయన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందడం ఖాయమన్నారు. మోసం తెలుగుదేశం నాయకుల నైజమని, తన కుటుంబం ఇప్పటికే రెండు సార్లు చంద్రబాబు చేతిలో నష్టపోయిందని ఆవేశంగా అన్నారు.
జగన్ ముఖ్యమంత్రి కావాల్సిందే..!
రానున్న ఎన్నికల్లో అధికార పార్టీ నాయకులు ఘోర పరాజయాన్ని చవిచూడక తప్పదని యలమంచిలి అన్నారు. వివాదాలకు అతీతంగా అందరి సహకారంతో పని చేస్తానని, నాటి వైఎస్ఆర్ పరిపాలన కావాలంటే, పేదలకు అన్నీ దక్కాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాల్సిందేనన్నారు. జగన్ పాదయాత్రతో అధికార పక్షం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని, రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు కూడా దక్కని స్థానాలు చూడనున్నామని యలమంచిలి చెప్పుకొచ్చారు. నీతి, న్యాయం ఆలంబనగా తమ కుటుంబం ఇప్పటి వరకు రాజకీయాలు చేసిందని, బాబుకు అది నచ్చకే తనకు సీటు నిరాకరించి ఉండవచ్చని ఎద్దేవా చేశారు.
తన తండ్రి యలమంచిలి నాగేశ్వరరావు విజయవాడ అభివృద్ధి కోసం ఎంతో చేశారని, ఆ పరంపరనే తాను కొనసాగించానని, వైసీపీ అధికారం లోకి వచ్చిన తరువాత చేయవలసిన పనులు చాలానే ఉన్నాయని, కాలక్రమేణా అన్నింటినీ పరిష్కరిస్తామని యలమంచిలి చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో చేసింది శూన్యమని, వారు చేసిన ఏ ఒక్క హామీనీ పూర్తి చేసిన దాఖలాలు లేవని దుయ్యబట్టారు.
ఈ రోజు ఉదయం పటమటలోని యలమంచిలి నివాసం నుండి భారీ ర్యాలీ నిర్వహించగా, నివాసం నుండి పటమట సెంటర్, ఎన్టీఆర్ సెంటర్, పంట కాలువ రోడ్డు, రామలింగేశ్వర నగర్ కట్ట, స్క్రూ బ్రిడ్జి, కృష్ణ లంక కట్ట మీదుగా యలమంచిలి రవి యూత్ నిర్వహించిన ర్యాలీ వారధి చేరుకుంది. పట్టణ నాయకులు ర్యాలీకి స్వాగతం పలుకుతూ, యలమంచిలి పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. మరోవైపు రవి నేతృత్వంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాదయాత్రలో పాల్గొని జగన్ కు ఘనస్వాగతం పలకడం ద్వారా యలమంచిలి నాయకత్వాన్ని బలపరిచారు.