vaikko: మేనల్లుడి ఆత్మాహుతి యత్నంతో బోరున విలపించిన వైగో!
- వైగో బావమరిది కుమారుడు శరవణ ఆత్మహత్యా యత్నం
- కాలినగాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న శరవణ
- ఇంకెవరూ ఇలాంటి పని చేయవద్దని కోరిన వైగో
ఆత్మాహుతికి యత్నించి, కాలిన గాయాలతో ఆసుపత్రిలో ఉన్న తన బావమరిది కుమారుడు శరవణ సురేష్ (50)ని చూసి ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో బోరున విలపించారు. పాత్రికేయుల సమక్షంలో కూడా వెక్కివెక్కి ఏడ్చారు. మధురైలోని అపోలో ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న శరవణను చూసి తలబాదుకుంటూ విలపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కావేరి వ్యవహారంలోనే కాకుండా మరే విషయంలో కూడా ఇంకెవరూ బలిదానాలు చేయవద్దని కోరారు.
శరవణ తన భార్య సోదరుడి పెద్ద కుమారుడని... తనకు ఎప్పుడూ తోడుగా ఉంటారని వైగో తెలిపారు. ఆయన పెళ్లిని కూడా తానే జరిపించానని... ఆయన కుమారుడు ఇంజినీరింగ్ చదువుతున్నాడని, కుమార్తె 8వ తరగతి చదువుతోందని చెప్పారు. మార్చి 30న సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు ఆయన చాలా బాధగా కనిపించాడని... స్టెరిలైట్ డీల్, న్యూట్రినో డీల్ చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుల పట్ల ఆవేదన వ్యక్తం చేశాడని తెలిపారు.
32 ఏళ్లుగా స్టెరిలైట్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నప్పటికీ... ఇలాంటి ఆరోపణలు ఎందుకు చేస్తున్నారంటూ బాధపడ్డాడని చెప్పారు. ఆయనకు సర్దిచెప్పి తాను పాదయాత్రకు వెళ్లిపోయానని తెలిపారు. మరుసటిరోజు మార్నింగ్ వాక్ కి వెళ్లిన ఆయన విరుదునగర్ క్రీడామైదానంలో పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నారని చెప్పారు. ఇకపై ఇలా ఎవరూ ఆత్మబలిదానాలకు పాల్పడవద్దని కోరారు.