Chandrababu: ‘నన్ను తిట్టిన ప్రతిపక్షనేతను జగన్మోహన్ రెడ్డి గారు’ అనే మాట్లాడతా : సీఎం చంద్రబాబు
- అఖిలపక్ష సమావేశంలో నేతలతో మాట్లాడిన చంద్రబాబు
- రాజకీయాల్లో హుందాతనం ఉండాలి
- ఢిల్లీ వెళ్లింది రాజకీయాల కోసం కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం
- ప్రజల మనోభావాలను కేంద్రం గుర్తించడం లేదు
‘నన్ను తిట్టిన ప్రతిపక్షనేతను జగన్మోహన్ రెడ్డి గారూ’ అనే మాట్లాడతానని, రాజకీయాల్లో హుందాతనం ఉండాలని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఈరోజు జరిగిన అఖిలపక్ష సమావేశంలో నేతలకు ఆయన తెలిపారు. ప్రత్యేకహోదా కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయని, గత సమావేశం తీర్మానం మేరకు రెండు రోజులు ఢిల్లీలో పర్యటించానని అన్నారు. రాజకీయాల కోసం కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను ఢిల్లీ వెళ్లానని, పార్లమెంటులో జాతీయ నేతను కలిసి ఏపీకి జరిగిన అన్యాయాన్ని వివరించిన విషయాన్ని ప్రస్తావించారు. అన్ని పక్షాలు ఏపీ పట్ల సానుకూలంగా ఉన్నాయని, రాష్ట్రానికి మోదీ చేసిన వాగ్దానాలను జాతీయ మీడియాకు వివరించానని చెప్పారు.
రాజకీయ లబ్ధి కోసమే ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చిందని దుష్ప్ర్రచారం చేశారని మండిపడ్డారు. ఏపీ సమస్యల్ని జాతీయస్థాయికి తీసుకెళ్ల గలిగామని, అయితే, కేంద్రం దబాయిస్తోందని, ప్రజల మనోభావాలను గుర్తించడలేదని విమర్శించారు. ఢిల్లీలో మోదీకి ఎదురు నిలిచామని, మోదీ మాట తప్పారనే విషయాన్ని జాతీయస్థాయిలో వివరించామని, జాతీయ స్థాయిలో బీజేపీ తప్ప టీడీపీకి అందరూ అనుకూలమేనని చెప్పారు. మూడు ప్రధాన పార్టీలు అఖిలపక్ష సమావేశానికి రాలేదని, ఈ పార్టీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించడం లేదని, ఏపీలో బీజేపీ బలపడాలనుకుంటోందని, నిధులు ఇవ్వకుండా టీడీపీని బలహీనపరచాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.