Jagan: పాండవుల్లాంటి మా ఎంపీలు ఐదుగురూ రాజీనామా చేశారు : వైఎస్ జగన్
- చెప్పిన మాటకు కట్టుబడే రాజీనామాలు చేయించా
- ఈ పోరాటంలో మాతో చంద్రబాబు కలిస్తే బాగుండేది
- ఏపీలోనే కాదు ఢిల్లీలో కూడా బాబును ఎవరూ నమ్మరు
రాష్ట్రం కోసం పాండవుల్లాంటి తమ పార్టీ ఎంపీలు ఐదుగురు రాజీనామాలు చేశారని వైసీపీ అధినేత జగన్ అన్నారు. గుంటూరు జిల్లా సంగం జాగర్లమూడిలో ఈ రోజు రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని యావత్తు దేశం చూడాలనే ఉద్దేశంతోనే తమ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేశారని అన్నారు.
గతంలో తాము చెప్పిన మాటకు కట్టుబడి ఆఖరి అస్త్రంగా తమ ఎంపీలతో రాజీనామాలు చేయించామని, ఈ పోరాటంలో తమతో చంద్రబాబు కలిస్తే బాగుండేదని అన్నారు. టీడీపీ ఎంపీలు కూడా తమ ఎంపీలతో పాటు రాజీనామా చేసి ఏపీ భవన్ లో నిరాహార దీక్షకు కూర్చుని ఉంటే కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చేదని అన్నారు. ఏపీలోనే కాదు ఢిల్లీలో కూడా చంద్రబాబును ఎవరూ నమ్మే పరిస్థితి లేదని, ఇటీవల ఢిల్లీలో పర్యటించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిన చంద్రబాబు, ఏపీకీ ప్రత్యేక హోదా కావాలని ఎక్కడా ప్రస్తావించలేదని విమర్శించారు.