: దేశంలో ఇక ప్లాస్టిక్ నోట్ల శకం
చిల్లులు, చిరుగులు, ప్లాస్టర్ అతుకులు, పెన్నుగీతలు, దుర్వాసన... ఇవన్నీ ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న కాగితపు కరెన్సీ నోట్ల ప్రత్యేకతలు. భవిష్యత్తులో ఈ ఇబ్బందులు తప్పనున్నాయి. జేబులో నోట్లు ఉంచుకుని భారీ వర్షంలో నిండుగా తడిచినా చెక్కు చెదరని ప్లాస్టిక్ నోట్లు రాబోతున్నాయి.
త్వరలోనే దేశంలో ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టనున్నామని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు నిన్న శ్రీనగర్ లో చెప్పారు. బ్యాంక్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ ప్లాటినం జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొనడానికి వచ్చిన సందర్భంగా ఆయనీ విషయాన్ని వెల్లడించారు. పేపర్ నోట్ల కంటే ప్లాస్టిక్ నోట్లకు జీవిత కాలం ఎక్కువని, పర్యావరణానికీ ప్రయోజనకరమేనన్నారు. పేపర్ కోసం పచ్చటి చెట్లను కూల్చే పని కూడా తప్పుతుంది పైలట్ ప్రాజెక్టు కింద మైసూర్, కోచి, జైపూర్, భువనేశ్వర్, సిమ్లాలో 100 కోట్ల పది రూపాయల నోట్లను విడుదల చేయాలని ఆర్ బిఐ ఇప్పటికే నిర్ణయించింది.
నకిలీ కరెన్సీ నోట్ల విషయమై సుబ్బారావు మాట్లాడుతూ.. వాటిని గుర్తించినప్పుడు బ్యాంకు, కస్టమర్ విధిగా రికార్డు చేయాలన్నారు. ఒక వ్యక్తి దగ్గర నాలుగు నోట్లకు మించి నకిలీ నోట్లు ఉన్నప్పుడే కేసు నమోదు చేయాలని సూచించామని సుబ్బారావు చెప్పారు.