: మీ జీవితకాలం పెరగాలంటే ... ఎండలో తిరగండి..
మన గోవాలో సూర్యరశ్మి చాలా ఆరోగ్యదాయకంగా చర్మసౌందర్య రక్షణకారిగా ఉంటుందనే ఉద్దేశంతోనే దేశవిదేశాలనుంచి అందాల భామలు ఎందరో వచ్చి.. ఇక్కడ ఇసుకతిన్నెల మీద శరీరాల్ని ఎండలో ఆరబెట్టుకుని ఆరోగ్యం పొంది వెళుతుంటారు. అదొక్కటే కాదు.. ఉదయం పూట ఎండలో తిరగడం వలన శరీరానికి చర్మ వికాసానికి అవసరమైన డి విటమిన్ సూర్యరశ్మిలో పుష్కలంగా దొరుకుతుందనే సంగతి కూడా మనకు తెలుసు. అయితే సూర్యరశ్మి వల్ల ఉండే ప్రయోజనాల్లో మరొక దానిని కూడా పరిశోధకులు కనుగొన్నారు.
చర్మంపై సూర్యరశ్మి పడడం వల్ల రక్తపోటు కూడా తగ్గుతుందిట. గుండెపోటు, పక్షవాతం ప్రమాదాలు కూడా దీనివల్ల తక్కువగా ఉంటాయిట. పర్యవసానంగా వ్యక్తి ఆయుష్షు పెరుగుతుందని లండన్లోని ఎడిన్బరో యూనివర్సిటీ వారు తేల్చారు. మన చర్మం ఎండ ప్రభావానికి లోనైనప్పుడు.. రక్తనాళాల్లో ఓ రసాయనం విడుదల అవుతుందని, అది రక్తపోటు తగ్గించేందుకు తోడ్పడుతుందని పేర్కొన్నారు. మొత్తానికి సూర్యకాంతి అనేది.. మన ఆరోగ్యంలో మరింత కీలకం కానున్నదన్నమాట.