Chandrababu: చంద్రబాబు చుట్టూ చాలా మంది ఆర్థిక నేరగాళ్లున్నారు : వైసీపీ నేత సుధాకర్ బాబు
- ఎంపీ విజయసాయిరెడ్డిపై విమర్శలు తగదు
- చంద్రబాబు చుట్టూ గంటా, సుజనా..వంటి ఆర్థిక నేరగాళ్లున్నారు
- కాల్ మనీ నేరగాళ్లూ ఆయన వద్దే ఉన్నారు
ఎంపీ విజయసాయిరెడ్డి ఆర్థిక నేరస్తుడంటూ సీఎం చంద్రబాబునాయుడు ఆరోపణలు చేస్తున్నారని, చంద్రబాబు చుట్టూ అలాంటి నేరగాళ్లు ఎంతమంది ఉన్నారో ఓసారి చూసుకోవాలని వైసీపీ అధికార ప్రతినిధి సుధాకర్ బాబు విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు చుట్టూ ఉన్న గంటా శ్రీనివాసరావు, సుజనా చౌదరి, వాకాటి, వెంకటగిరి టీడీపీ ఎమ్మెల్యే.. ఇలా చాలామంది ఆర్థిక నేరగాళ్లేనని ఆరోపించారు.
కాల్ మనీ నేరగాళ్లు, రాజధాని భూములు కాజేసిన వాళ్లు చంద్రబాబు చుట్టూ ఉన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఉద్యమం కోసం ప్రజలు సమాయత్తమవుతున్నారని, దీని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే విజయసాయిరెడ్డిపై చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఒక రాజ్యసభ సభ్యుడిని ఆర్థిక నేరస్తుడంటూ చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డ ఆయన, చంద్రబాబు ఆడుతున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.