Chandrababu: చంద్రబాబుపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తా.. శివాజీ చెప్పింది నాకు అర్థం కాలేదు: విజయసాయిరెడ్డి

  • ప్రధాని కార్యాలయాన్ని నేరస్తుల అడ్డాగా ప్రకటించారు
  • ఇది ముమ్మాటికీ సభా హక్కుల ఉల్లంఘనే
  • హీరో శివాజీ చెప్పింది కాసేపే చూశా

ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం నేరగాళ్లకు అడ్డాగా మారిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. దేశ ప్రధానమంత్రిని కించపరిచేలా, దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రధాని కార్యాలయాన్ని నేరస్తుల అడ్డాగా పేర్కొంటూ, అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

పార్లమెంటరీ వ్యవస్థలో సభా హక్కుల ఉల్లంఘనకు చంద్రబాబు పాల్పడ్డారని చెప్పారు. ప్రధానిని కలిసే హక్కు ప్రతి ఎంపీకి ఉంటుందని... ఇంకా చెప్పాలంటే దేశంలోని ఏ పౌరుడికైనా ప్రధానిని కలిసే అవకాశం ఉంటుందని, పీఎం అపాయింట్ మెంట్ ను ఎవరైనా అడగవచ్చని తెలిపారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ, నలభై ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం శోచనీయమని అన్నారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబుకు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాలని, అతని నుంచి వివరణ కోరాలని విజయసాయి అన్నారు. చట్ట ప్రకారం చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలనేది తన అభిప్రాయమని చెప్పారు. సభాహక్కుల ఉల్లంఘన నోటీసు మీరు ఇస్తే... బీజేపీతో వైసీపీ కుమ్మక్కయిందని ప్రజలు భావించే అవకాశం ఉంది కదా? అనే ప్రశ్నకు బదులుగా... ఇది ఏ ఒక్క పార్టీకి సంబంధించిన అంశం కాదని... ప్రధాని అనే వ్యక్తి దేశం మొత్తానికి ప్రధాని అని... అందుకే ఒక ఎంపీగా తాను నోటీసు ఇవ్వాలనుకుంటున్నట్టు వివరించారు. మోదీకి చంద్రబాబు క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.

వైసీపీని ఉపయోగించుకుని టీడీపీని అణగదొక్కేందుకు బీజేపీ ఆపరేషన్ ద్రవిడ చేపట్టిందనే అంశానికి సంబంధించి విజయసాయిరెడ్డి మాట దాటవేశారు. ఎవరో సినిమా నటుడు ఒక బోర్డుపై ఏవో బొమ్మలు వేసి, ఏదో చెప్పారని... తనకు ఏమీ అర్థం కాలేదని, తాను కాసేపు మాత్రమే దాన్ని చూశానని... పూర్తిగా చూసిన తర్వాత దానిపై మాట్లాడతానని చెప్పారు. 

More Telugu News