Facebook: పత్తాలేని ఫేస్ బుక్ అధినేత! యూజర్ల సమాచారం చోరీపై స్పందన కరవు

  • ఇంత వరకు అధికారికంగా స్పందించని జుకెర్ బెర్గ్
  • కంపెనీ సీవోవో శాండ్ బర్గ్ సైతం మౌనం
  • వివరణ కోరిన యూరోపియన్ యూనియన్

ఫేస్ బుక్ యూజర్లు ఐదు కోట్ల మంది సమాచారం చోరీకి గురైన విషయం ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకు దారితీస్తుంటే, మరోవైపు ఆ సంస్థ అధినేత, సీఈవో మార్క్ జుకెర్ బెర్గ్ మాత్రం ఇప్పటికీ స్పందించకుండా మౌనం దాలుస్తుండడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనీసం ఫేస్ బుక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, కంపెనీ ప్రజా సంబంధాల వ్యూహకర్త షెరిల్ శాండ్ బర్గ్ కూడా ఇంత వరకు స్పందించకపోవడంతో వీళ్లెక్కడికి పోయారు? అన్న సందేహాలు చాలా మందిలో మొదులుతున్నాయి.

సాధారణంగా ఫేస్ బుక్ కు సంబంధించి విమర్శలు వచ్చినా, వివాదాలు ఏర్పడినా జుకెర్ బెర్గ్ కానీ, షెరిల్ శాండ్ బర్గ్ కానీ ఎవరో ఒకరు బ్లాగ్ ద్వారా స్పందిస్తుంటారు. కానీ, డేటా చోరీపై వీరింత వరకు మీడియా ముందుకు రాలేదు. ఈ శుక్రవారం కంపెనీ ఉద్యోగులను ఉద్దేశించి జుకెర్ బెర్గ్ మాట్లాడాల్సి ఉంది. కేంబ్రిడ్జ్ అనలైటిక అనే ఆన్ లైన్ ప్రకటనల కన్సల్టింగ్ కంపెనీ, ఫేస్ బుక్ యూజర్ల సమాచారాన్ని అనధికారికంగా సేకరించినట్టు ఆరోపణలు రాగా, దీన్ని ఫేస్ బుక్ కూడా ధ్రువీకరించిన విషయం తెలిసిందే. దీనిపై వివరణ ఇవ్వాలని యూరోపియన్ యూనియన్, బ్రిటిష్ చట్ట సభ సభ్యులు ఇప్పటికే డిమాండ్ చేయడం గమనార్హం.

More Telugu News