Sumitra Mahajan: బీజేపీ ఎంపీ సంచలన ప్రతిపాదన.. ఘాటుగా బదులిచ్చిన టీఆర్ఎస్ ఎంపీ కవిత!

  • సభలో అనవసర ఆందోళనకు దిగుతున్నారన్న బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ
  • ‘నో వర్క్-నో పే’ను ప్రతిపాదిస్తూ స్పీకర్‌కు లేఖ
  • కావాలని ఎవరూ ఆందోళనకు దిగరన్న కవిత

బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ సంచలన ప్రతిపాదన తీసుకొచ్చారు. పనిచేయని ఎంపీలకు వేతనం కట్ చేయాలని సూచిస్తూ లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్‌కు లేఖ రాశారు. ‘నిర్మాణాత్మక పనులు’ చేయని ఎంపీల వేతనం కట్ చేయాలని అందులో కోరారు. ‘నో వర్క్- నో పే’ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. పార్లమెంటులో ఎంపీల అనవసర, అర్థంలేని గందరగోళం తనను ఎంతగానో బాధిస్తోందన్నారు. గత 12 రోజలుగా సభ్యుల ఆందోళనతో పార్లమెంటు సమావేశాలు సరిగా సాగడం లేదని, దీనికి కారణంగా విలువైన ప్రజాధనం, సమయం వృథా అవుతున్నాయని తివారీ ఆవేదన వ్యక్తం చేశారు.

తివారీ లేఖపై టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు. ఎవరూ కావాలని పార్లమెంటులో ఆందోళనకు దిగరన్న విషయాన్ని తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. తివారీ తీరు చూస్తుంటే ‘దొంగే దొంగ’ అని అరుస్తున్నట్టు ఉందని ఎద్దేవా చేశారు. ఏ పార్టీ కానీ, ఎంపీ కానీ కావాలని, సమావేశాలను అడ్డుకోవాలని చూడరని కవిత పేర్కొన్నారు. ఈ విషయంలో మారాల్సింది ప్రభుత్వం తీరేనని స్పష్టం చేశారు.

More Telugu News