Nirav Modi: భారత్ కు రాను... భారతీయ చట్టాలను ఎదుర్కోలేను: నీరవ్ మోదీ సమాధానం
- ప్రాథమిక హక్కును వినియోగించుకోలేను
- నా కార్యాలయ సర్వర్లను స్వాధీనం చేసుకున్నారు
- దర్యాప్తునకు అవసరమైన సమాచారం ఇచ్చి సమర్థించుకోలేని పరిస్థితి
- సీబీఐ సమన్లకు స్పందించిన వజ్రాల వ్యాపారి
పంజాబ్ నేషనల్ బ్యాంకుకు ఏకంగా రూ.13,000 కోట్లకు పైగా టోపీ పెట్టి విదేశాలకు పరారైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ స్వదేశానికి వచ్చి విచారణను ఎదుర్కోలేనంటూ సీబీఐ పంపిన డిజిటల్ సమన్లకు సమాధానం ఇచ్చారు. సీబీఐ, ఈడీ తన ఆస్తులను, పత్రాలను స్వాధీనం చేసుకోవడం ద్వారా దర్యాప్తునకు అవసరమైన సమాచారం అందించలేని అచేతనుడిగా తనను మార్చేశాయని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘నా కార్యాలయంలోని సర్వర్లను సీబీఐ స్వాధీనం చేసుకున్న విషయం మీకు తెలుసు. దీంతో చట్టప్రకారం నన్ను నేను సమర్థించుకునేందుకు వీలుగా నా ప్రాథమిక హక్కును సరిగ్గా వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఏ సమాచారం అందించలేని వికలుడిగా మారిపోయాను’’ అని తన సమాధానంలో మోదీ పేర్కొన్నారు. భారత్ కు తిరిగి రావడానికి తిరస్కరిస్తూ తన భద్రత, పారదర్శక దర్యాప్తు నిర్వహించే విషయంలో తాను లేవనెత్తిన ప్రశ్నలకు సీబీఐ ఇంత వరకు సమాధానమే ఇవ్వని విషయాన్ని గుర్తు చేశారు.