Iraq: కిడ్నాప్ చేసిన 39 మంది భారతీయులను ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు హతమార్చారు: రాజ్యసభలో ప్రకటించిన సుష్మా స్వరాజ్

  • 2014లో కిడ్నాప్ కు గురైన ఉగ్రవాదులు
  • నాలుగేళ్ల కృషి విఫలమైంది
  • కుళ్లిపోయిన స్థితిలో మృతదేహాలు
  • 70 శాతం డీఎన్ఏ మ్యాచ్ అయింది
  • అవశేషాలను తెప్పిస్తున్నామన్న సుష్మా స్వరాజ్

ఇరాక్ లో కిడ్నాపైన 39 మంది భారతీయులూ ఇక లేరని, వారిని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ రాజ్యసభలో ప్రకటించారు. ఈ ఉదయం తాను ఓ ముఖ్యమైన ప్రకటన చేయాల్సి వుందని చెప్పిన ఆమె, రాజ్యసభలో మాట్లాడుతూ, 2014లో వీరి కిడ్నాప్ జరిగిందని, వారిని గుర్తించేందుకు తామెంతో కృషి చేసి, విఫలమయ్యామని తెలిపారు. మోసూల్ లో వీరిని పూడ్చి పెట్టిన చోటును రాడార్ల సాయంతో కనుగొన్నామని, మృతదేహాలను బయటకు తీయగా, పూర్తిగా కుళ్లిపోయి ఉన్నాయని, మృతదేహాలను బాగ్దాద్ కు తీసుకెళ్లి డీఎన్ఏ శాంపిల్స్ ను పరీక్షించగా, 70 శాతం మ్యాచ్ అయ్యాయని అన్నారు.

ఆ అవశేషాలను ఇండియాకు తెచ్చేందుకు జనరల్ వీకే సింగ్ ఇరాక్ వెళ్తున్నారని, ప్రత్యేక విమానంలో అవశేషాలను తీసుకు వస్తామని అన్నారు. ఆపై అవశేషాలను అమృత్ సర్, పట్నా, కోల్ కతా ప్రాంతాల్లోని వారి కుటుంబీకులకు అందిస్తామని తెలిపారు. కాగా, వీరంతా ఎక్కడో ఒకచోట బతికే ఉంటారని ఆశగా ఉన్న వారి కుటుంబాలను సుష్మా స్వరాజ్ ప్రకటన ఒక్కసారిగా విషాదంలో ముంచేసింది. ఆపై రాజ్యసభలో మృతుల ఆత్మలకు శాంతి చేకూర్చాలని సభ మౌనం పాటించింది. ఆపై సుష్మా లోక్ సభలోనూ సభ్యుల నినాదాల మధ్య ఇదే ప్రకటన చేశారు.

More Telugu News