Nidahas trophy: బంగ్లాదేశ్‌పై విజయంతో ఫైనల్లోకి దర్జాగా ప్రవేశించిన భారత్

  • ముక్కోణపు టోర్నీలో భారత్‌కు వరుసగా మూడో విజయం
  • రాణించిన కెప్టెన్ రోహిత్ శర్మ
  • బంగ్లాదేశ్‌పై 17 పరుగుల తేడాతో విజయం

నిదహాస్ ట్రోఫీ పైనల్లోకి  భారత్ ప్రవేశించింది. బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగిన ఐదో మ్యాచ్‌లో భారత్ 17 పరుగుల తేడాతో విజయం సాధించి దర్జాగా ఫైనల్లోకి దూసుకెళ్లింది.

కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది. ఈ టోర్నీలో మూడు మ్యాచ్‌లు గెలిచిన భారత్ నేరుగా ఫైనల్లోకి దూసుకెళ్లింది. మూడేసి మ్యాచ్‌లు ఆడిన శ్రీలంక, బంగ్లాదేశ్ చెరో గెలుపుతో రెండు పాయింట్లతో సమ ఉజ్జీలుగా ఉన్నాయి. దీంతో రేపటి మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి నుంచీ ధాటిగా ఆడింది. వరుసగా విఫలమవుతూ వస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ (89) ఈ మ్యాచ్‌లో రెచ్చిపోయాడు. 61 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మరో ఓపెనర్ శిఖర్ ధవన్ (35), సురేశ్ రైనా (47) కూడా రాణించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 176 పరుగులు చేసింది.

అనంతరం 177 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 12 పరుగులకే ఓపెనర్ లిటన్ దాస్ (7) వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత కూడా వికెట్ల పతనం కొనసాగింది. అయితే వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ చెలరేగి ఆడడంతో భారత శిబిరంలో ఆందోళన నెలకొంది. 55 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్‌తో 72 పరుగులు చేసి విజయంపై ఆశలు రేపాడు. అయితే మిగతా బ్యాట్స్‌మన్లు త్వరత్వరగా అవుటవడంతో అతడి పోరాటం ఫలించలేదు. వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లు తీసి బంగ్లాదేశ్‌ను దెబ్బకొట్టాడు. దీంతో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేసి విజయానికి 17 పరుగుల దూరంలో నిలిచిపోయింది. అద్భుతంగా ఆడిన రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డు లభించింది.

More Telugu News