Telangana: అందుకే, మిగతా పార్టీల సభ్యులను టీఆర్ఎస్లో కలుపుకున్నాం: కేసీఆర్
- రాజకీయ సుస్థిరత చాలా ముఖ్యం
- దానికోసమే మిగతా పార్టీల సభ్యులను కలుపుకున్నాం
- తెలంగాణను అభివృద్ధి చేసుకోవడమే నా లక్ష్యం
- వంద శాతం నిస్వార్థంగా పనిచేస్తున్నాం
తెలంగాణ తేవడం ఎంత ముఖ్యంగా భావించామో రాజకీయ సుస్థిరత సాధించడం కూడా అంతే ముఖ్యంగా భావించామని, అందుకే తాము మిగతా పార్టీల సభ్యులను టీఆర్ఎస్లో కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ రోజు శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణను అభివృద్ధి చేసుకోవడమే తన లక్ష్యమని అన్నారు. తాము వంద శాతం నిస్వార్థంగా పనిచేస్తున్నామని, గతంలో సచివాలయంలో పైరవీ ముఠాలు యథేచ్ఛగా ఉండేవని ఇప్పుడు లేవని అన్నారు.
టెండర్లలో అవినీతి జరిగితే ప్రతిపక్షాలు నిరూపించాలని, అంతేగానీ నిరాధార ఆరోపణలు చేయకూడదని కేసీఆర్ అన్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలు చేస్తోన్న అవినీతి ఆరోపణలను నిరూపించలేకపోయారని అన్నారు. తమ పాలనలో మిషన్ కాకతీయ కింద 17 వేల చెరువులు బాగుపడ్డాయని, మరో 6, 7 చెరువుల మరమ్మతు పనులు జరుగుతున్నాయని కేసీఆర్ చెప్పారు. తాము తెలంగాణలో పరిశ్రమలకు 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామని, చాలా అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని, ప్రజలు సంతృప్తిగా ఉన్నారని అన్నారు.