: దొందూ దొందే అయినా..
కాంగ్రెస్, బీజేపీ.. రెండూ జాతీయ పార్టీలే. ఒకటి కేంద్రంలో అధికారంలో ఉండగా, మరోకటి ఇప్పటివరకు కర్ణాటకను ఏలింది. అక్కడ కేంద్రంలో కాంగ్రెస్ మంత్రులపై అవినీతి ఆరోపణలకు కొదవేంలేదు. ఇక్కడ కన్నడనాట బీజేపీ కూడా ఏమీ తక్కువ తినలేదు. యూపీఏ పాలనలో 2జీ స్కాం నుంచి తాజాగా రైల్వే మంత్రిపై ఆరోపణల వరకు కాంగ్రెస్ ను అవినీతి భూతం వెంటతరుముతూనే ఉంది.
విపక్షాల దాడులను తప్పించుకోవడానికి పార్లమెంటు ఉభయసభలను తరచూ వాయిదా వేయడం మినహా సర్కారు చేయగలిగింది శూన్యం. చివరికి సీబీఐ వ్యవహారశైలిపైనా విమర్శలు చెలరేగాయంటే అర్థమవుతోంది, కేంద్రం వ్యవహారశైలి ఎలా ఉందో! ఇక కర్ణాటకలో అధికారం చేజిక్కించుకోవడం ద్వారా తొలిసారి దక్షిణాదిలో పాగా వేసిన బీజేపీ ఇప్పుడు తీరిగ్గా విచారిస్తోంది. అధికారంలో ఉన్నన్నాళ్ళూ అవినీతి పరులకు వంతపాడడం, తాజా ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలను ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం మాత్రం బీజేపీపై ప్రజల్లో నెలకొన్న తీవ్ర ఆగ్రహమేనని తెలుస్తోంది.
గనుల మాఫియా రారాజులకు పార్టీలో పెద్దపీట వేయడం, పార్టీలో నిత్యం లుకలుకలు, వీటన్నింటిని మించి బీజేపీ పార్టీలో ఉన్పప్పుడు యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా వెలగబెడుతూ అవినీతి కేసులో జైలుకెళ్ళడం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను పెంచింది. దారుణమైన రీతిలో బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నీలి చిత్రాలు చూస్తూ కూర్చోవడం, ఓ శాసనసభ్యుడిపై అత్యాచార ఆరోపణలు రావడం కన్నడనాట కమలాన్ని వికసించనీయలేదు.
దీనికి తోడు ప్రజాసమస్యలను గాలికొదిలేయడంతో, పార్టీకి అన్నివిధాలా ప్రధాన వనరుగా పేరుగాంచిన గాలి జనార్థనరెడ్డి జైల్లో ఊచలు లెక్కబెడుతుండడం కూడా బీజేపీని దెబ్బతీసింది. బీజేపీ అసమర్థతను ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో అక్కడి కాంగ్రెస్ నేతలు విజయవంతం అయ్యారు. అందుకు తాజా ఫలితాలే రుజువు. కాంగ్రెస్ వర్తమానం ఏమీ ఘనంగా లేకున్నా.. బీజేపీకి చరమగీతం పాడాలన్న కృత నిశ్చయం ఇక్కడి ఓటింగ్ సరళిలో ప్రతిబింబించింది.