Jagan: 14వ ఆర్థిక సంఘం 'హోదా' ఇవ్వడానికి ఒప్పుకోలేదని కేంద్రం చెబితే చంద్రబాబు తలూపారు: జగన్
- గుంటూరు జిల్లాకు చేరుకున్న జగన్ పాదయాత్ర
- నాలుగేళ్లుగా చంద్రబాబు 'హోదా' గురించి పట్టించుకోలేదు-జగన్
- చంద్రబాబు ప్రజలను మభ్య పెడుతున్నారు
రాష్ట్ర ప్రజల కష్టాలను చంద్రబాబు నాయుడు పట్టించుకోవడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అన్నారు. ప్రకాశం జిల్లాలో తన పాదయాత్రను పూర్తి చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు గుంటూరు జిల్లాలో తన పాదయాత్రను ప్రారంభించారు. ఆ జిల్లాలోని బాపట్లలో ప్రజలతో ముచ్చటిస్తూ ముందుకు కదిలారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను మభ్య పెడుతున్నారని అన్నారు. గిట్టుబాటు ధరల్లేక రైతన్నలు కష్టాలు పడుతోంటే చంద్రబాబు మాత్రం రాష్ట్రంలో వ్యవసాయం బ్రహ్మండంగా ఉందంటున్నారని, రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు.
యువతకు ఉద్యోగాల కల్పనపై కూడా చంద్రబాబు దృష్టి పెట్టడం లేదని, మరోవైపు పరిశ్రమలు వస్తున్నాయని, ఉద్యోగాలు వస్తున్నాయని మభ్య పెడుతున్నారని జగన్ అన్నారు. జాబు రావాలంటే బాబు రావాలని ఎన్నికల ముందు టీడీపీ ప్రచారం చేసుకుందని, ఇంటికో ఉద్యోగం ఇస్తానని, ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగి భృతి ఇస్తానని అన్నారని తెలిపారు. నాలుగేళ్లుగా నిరుద్యోగ భృతి చెల్లించలేదని, ఆ లెక్కన ఒక్కొక్క నిరుద్యోగికి రావాల్సిన భృతి 94 వేల రూపాయలని అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక గ్రామినికో మినరల్ వాటర్ ప్లాంట్ ఉందో లేదో కానీ బెల్ట్ షాప్ మాత్రం ఉందని చురకలంటించారు.
మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదాపై చంద్రబాబు దృష్టి పెట్టలేదని జగన్ అన్నారు. అప్పట్లో హోదాకు 14వ ఆర్థిక సంఘం ఒప్పుకోలేదని, ఇవ్వడం కుదరదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంటే చంద్రబాబు తలూపారని అన్నారు. నాలుగేళ్లుగా హోదా గురించి నాటకాలు ఆడిన చంద్రబాబు తమ పోరాటంతో ఒక్కసారిగా నిద్రలేచి తమ నేతలతో కేంద్ర మంత్రుల పదవులకు రాజీనామా చేయించారని అన్నారు.