Andhra Pradesh: బీజేపీతో జగన్ మోహన్ రెడ్డి ఎందుకు కలుస్తారు? : విష్ణుకుమార్ రాజు
- బీజేపీతో వైసీపీ పొత్తు విషయాన్ని జగన్ నే అడగండంటూ విలేకరికి చెప్పిన ఎమ్మెల్యే
- ఇప్పటిదాకా, మాతో ఉన్న వాళ్లు ఏం చేశారో చూశారుగా!
- బీజేపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ : విష్ణుకుమార్ రాజు
బీజేపీతో వైసీపీ పొత్తు పెట్టుకుంటుందనే విషయమై ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుని ప్రశ్నించగా ఆసక్తికర సమాధానమిచ్చారు. విజయవాడలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ‘బీజేపీతో జగన్ పొత్తు పెట్టుకుంటారనే వార్తలు బాగా వినపడుతున్నాయి’ అనే దానికి విష్ణుకుమార్ రాజు స్పందిస్తూ, బీజేపీతో జగన్ మోహన్ రెడ్డి ఎందుకు కలుస్తారు?ఈ విషయాన్ని ఆయన్నే అడగాలంటూ సదరు విలేకరితో అన్నారు. వైసీపీ వాళ్ల పని వాళ్లు చేసుకుంటున్నారని, అదేవిధంగా, టీడీపీ కూడా వాళ్ల పని చేసుకుంటోందని అన్నారు. ఇప్పటిదాకా, తమతో కలిసి ఉన్న వాళ్లు ఏం చేశారో చూశారు కదా! అంటూ పరోక్షంగా టీడీపీపై విమర్శలు గుప్పించారు. తమ పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, తన నాయకులు ఎంతో పద్ధతిగా వ్యవహరిస్తారని విష్ణుకుమార్ రాజు అన్నారు.