jaya bachchan: నామినేషన్ వేసిన జయాబచ్చన్

  • రాజ్యసభ ఎన్నికలకు జయ నామినేషన్
  • సమాజ్ వాదీ పార్టీ నుంచి మరోసారి ఎన్నికల బరిలోకి
  • జయ వెంట డింపుల్ యాదవ్, సబ్రతారాయ్

రాజ్యసభ స్థానానికి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ భార్య జయా బచ్చన్ నామినేషన్ దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిగా ఆమె నామినేషన్ వేశారు. నామినేషన్ కార్యక్రమానికి ఎస్పీ అధినేత అఖిలేష్ సింగ్ యాదవ్ భార్య డింపుల్, ఇతర నేతలు రాజేంద్ర చౌదరి, కిరణ్మయ్ నందాలతో పాటు సహారా ఇండియా అధినేత సుబ్రతా రాయ్ కూడా హాజరయ్యారు. పార్లమెంటు సెంట్రల్ హాల్ లో ఆమె నామినేషన్ దాఖలు చేశారు. వచ్చే నెలలో ఆమె 70 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టబోతున్నారు.

నామినేషన్ అనంతరం జయా బచ్చన్ మీడియాతో మాట్లాడుతూ, ములాయం సింగ్ యాదవ్ కు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ధన్యవాదాలు చెబుతున్నానని తెలిపారు. కిరణ్మయ్ నందా, నరేష్ అగర్వాల్ లాంటి సీనియర్లను కాదని మీకు పార్టీ టికెట్ ఎలా దక్కిందన్న ప్రశ్నకు సమాధానమిస్తూ... తాను కూడా సీనియర్ నే అని చెప్పారు. ఏప్రిల్ 2వ తేదీతో ఆమె రాజ్యసభ ఎంపీ కాలపరిమితి ముగుస్తోంది. ఉత్తర ప్రదేశ్ నుంచి 10 రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరగబోతున్నాయి.

More Telugu News