Chandrababu: ఆ రోజు మోదీ చెప్పిన మాటనే.. ఈ రోజు నేను అడుగుతున్నా: చంద్రబాబు
- బిడ్డను బతికించి, తల్లిని చంపేశారని మోదీ అన్నారు
- తాను ప్రధాని అయితే తల్లీబిడ్డలిద్దరినీ బతికించేవాడినని చెప్పారు
- అప్పుడు మోదీ చెప్పిన విషయాన్నే, ఇప్పుడు నేను అడుగుతున్నా
రాష్ట్రాన్ని హేతుబద్ధత లేకుండా విభజించారని... దీనివల్లే ఇరు రాష్ట్రాల మధ్య రూ. 38 వేల మేర తలసరి ఆదాయంలో తేడా వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీకి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ గత ఎన్నికల ప్రచార సమయంలో ప్రధాని అభ్యర్థిగా మాట్లాడుతూ... తాను ప్రధానిగా ఉంటే రెండు రాష్ట్రాలకు సమన్యాయం చేసేవాడినని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ బిడ్డను బతికించి, తల్లిని చంపేసిందంటూ విమర్శించారని చెప్పారు. తానైతే తల్లీ బిడ్డలను ఇద్దర్నీ బతికించేవాడినని చెప్పారని తెలిపారు.
తాను ప్రస్తుతం ఆ విషయాన్నే అడుగుతున్నానని... ఇద్దరికీ న్యాయం చేస్తానని చెప్పిన మీరు... విభజన చట్టంలో ఉన్నవాటిని ఎందుకు నెరవేర్చడం లేదని మోదీని ఉద్దేశించి ప్రశ్నించారు. 29 సార్లు తాను ఢిల్లీకి వెళ్లినా సరైన ప్రతిఫలం దక్కలేదని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ, ఈ మేరకు విమర్శలు గుప్పించారు. విభజన చట్టంలోని లోపాలను ఎందుకు సరిదిద్దడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఇంకా సంయమనం పాటిస్తున్నామని చెప్పారు. నీతి అయోగ్ సూచనల తర్వాతే పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారని చెప్పారు.