Nirav Modi: నీరవ్ మోదీకి కోపం వచ్చింది! మహిళా ఉద్యోగిని అరెస్ట్ చేయడంపై ఈడీకి ఘాటుగా లేఖ
- ఆమె అరెస్ట్ చట్టవిరుద్ధం
- దర్యాప్తులో నా భద్రత గురించి ఆందోళన ఉంది
- దర్యాప్తు ప్రక్రియను ఉల్లంఘించరాదన్న నీరవ్
పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.12,700 కోట్ల మేర మోసం చేసి విదేశాలకు పరారైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి కోపం వచ్చింది. ఎందుకంటే, మోదీ కంపెనీలో పనిచేసే మహిళా ఉద్యోగి కవితా మంకికర్ ను సీబీఐ అరెస్ట్ చేయడమే. తన కంపెనీ మహిళా ఉద్యోగిని అరెస్ట్ చేసిన తీరు చట్టవిరుద్ధమని నీరవ్ అభివర్ణించారు. ఈ మేరకు ఆయన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు లేఖ రాశారు.
'నా సంస్థలో పనిచేసే మహిళా ఉద్యోగిని సీబీఐ అరెస్ట్ చేయడం చట్ట విరుద్ధం. ఇది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కు పూర్తి ఉల్లంఘనే. దర్యాప్తు సంస్థలు మహిళా ఉద్యోగి స్వేచ్ఛను పరిగణనలోకి తీసుకోనప్పుడు, నా భద్రత గురించే నా ఆందోళన. దర్యాప్తు ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం చేయరాదు’’ అని ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ అర్చనా సలాయేకు గత నెల 26న నీరవ్ లేఖ రాశారు.
కవిత మంకికర్ లాయర్ వాదన ప్రకారం తన క్లయింట్ ను రాత్రి 8 గంటల తర్వాత అరెస్ట్ చేశారని, చట్ట ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఓ మహిళను అరెస్ట్ చేయరాదని పేర్కొన్నారు. ఈడీ గత నెల నీరవ్ మోదీకి సమన్లు పంపగా, వాటికి ప్రతిస్పందనగా నీరవ్ మోదీ రెండు లేఖలు రాశారు. వాటిలో ఒక లేఖలో తన ఉద్యోగి అరెస్ట్ ను ఖండించారు.