Andhra Pradesh: కేంద్ర సర్కారు ప్రకటించిన మద్దతు ధరకు రైతుల నుండి కందులు కొనుగోలు: ఏపీ సీఎస్
- క్వింటాల్‌కు రూ.5,450 మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేసేలా చర్యలు
- మార్కెట్ ధరకంటే రూ.1000 పైగా అధికంగా మద్దతు ధర ఉంది
- 7 జిల్లాల్లో 78 కంది కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
కేంద్ర సర్కారు ప్రకటించిన విధంగా రైతుల నుండి కందులను క్వింటాల్ కు 5,450 రూపాయల మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్.. అధికారులను ఆదేశించారు. ఈ రోజు అమరావతిలోని సచివాలయంలో అధికారులతో కందుల విషయమై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.. ప్రస్తుతం మార్కెట్లో కందులు క్వింటాల్ ధర రూ.4,200గా ఉండగా కేంద్ర ప్రభుత్వం క్వింటాల్ కు రూ.5,450 మద్దతు ధరను నిర్ణయించిందని గుర్తు చేశారు.
మార్కెట్ ధరకంటే రూ.1000 పైగా అధికంగా మద్దతు ధర ఉన్నందున రైతులు.. వారు పండించిన కంది పంటను కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించుకునేందుకు కృషి చేయాలని సీఎస్ సూచించారు. కందిని పండించిన రైతులు అందరూ వారి పంటను సక్రమంగా మద్దతు ధరకు విక్రయించుకునే విధంగా కొనుగోలు కేంద్రాల ద్వారా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని మార్క్ ఫెడ్ అధికారులను ఆయన ఆదేశించారు.
రైతుల నుండి మద్దతు ధరకు కొనుగోలు చేసిన కందిని ఫౌర సరఫరాలు, సంక్షేమ శాఖలు, విద్యా శాఖలు నిర్దేశిత అక్విజిషన్ ధరల ప్రకారం తీసుకుని మిల్లింగ్ చేయించి కంది పప్పుగా వినియోగించుకునేందుకు చర్యలు తీసుకోవాలని దినేశ్ కుమార్ ఆదేశించారు. కేంద్ర సర్కారు ప్రకటించిన మద్దతు ధర వల్ల సుమారు లక్ష మంది రైతులకు 140 కోట్ల రూపాయలు అదనంగా ఆదాయం సమకూరుతుందని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మార్క్ ఫెడ్ ఎండీ మధు సూదన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2017-18 ఖరీఫ్ లో 264000 హెక్టార్లలో కంది సాగు చేయగా 2 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచనా వేశామని వివరించారు. లక్ష మెట్రిక్ టన్నుల కందిని మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిందిగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా కేంద్రం 45,200 మెట్రిక్ టన్నులకు అనుమతిచ్చిందని తెలిపారు.
ఆ ప్రకారం రాష్ట్రంలో 7 జిల్లాల్లో గల 78 కంది కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధరకు రైతుల నుండి కందిని కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. ఇందుకు సంబంధించి కంది పండించిన రైతులందరికీ ప్రత్యేకంగా కూపన్లు జారీ చేశామని, ఆ కూపన్లను చూపి ఆయా కేంద్రాల్లో వారి కందిపంటను మద్దతు ధరకు విక్రయించుకోవచ్చని చెప్పారు. అదనంగా మరో 55 వేల మెట్రిక్ టన్నుల కందిని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కేంద్రానికి మరలా ప్రతిపాదనలు పంపామని దానిలో కనీసం మరో 25 వేల టన్నులకు అనుమతించే అవకాశం ఉంటుందని బావిస్తున్నామని ఆయన తెలిపారు.