Chandrababu: అందుకే, నేను ఇంటర్ ఫస్టియర్ ఫెయిలయ్యాను!: చంద్రబాబు
- నాకు పదహారేళ్లప్పుడు అన్నింటిని తేలికగా తీసుకునేవాడిని
- విద్యార్థి దశలో నేనెప్పుడూ సిగిరెట్ తాగలేదు
- ‘హింస’ అనే పదానికి నా జీవితంలో చోటులేదు
- ఓ ఇంటర్వ్యూలో చంద్రబాబు
తనకు పదహారేళ్ల వయసున్నప్పుడు అన్నింటిని చాలా తేలికగా తీసుకునేవాడినని, అందుకే, ఇంటర్ ఫస్టియర్ ఫెయిలయ్యానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తన చిన్ననాటి విషయాలను గుర్తుచేసుకున్నారు. రాజకీయ జీవితంలో నలభై ఏళ్లు పూర్తి చేసుకున్న చంద్రబాబు ‘ఏబీఎన్’ ఛానెల్ తో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన చెబుతూ, ఆ తర్వాత తిరుపతి వెళ్లి చదువుకున్న తనకు అన్నీ విజయాలేనని చెప్పారు. విద్యార్థి దశలో ఉన్నప్పుడు తానెప్పుడూ సిగిరెట్ తాగలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. యూనివర్శిటీలో చదువుకుంటున్న సమయంలో అవతలి బ్యాచ్ తో గొడవ జరిగిన సందర్భాన్ని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు.
అవతలి బ్యాచ్ వారిని చూసి, తమ బ్యాచ్ భయపడి పారిపోయిందని, అయితే, తాను వెళ్లి తమ బ్యాచ్ ను ముందుకు నడిపించడంతో, అవతలి వారు పారిపోయారని అన్నారు. ఈ సంఘటనతో తనపై కేసులు పెట్టారని, ఆ తర్వాత కొట్టేశారని, ‘హింస’ అనే పదానికి తన జీవితంలో చోటులేదని చెప్పుకొచ్చారు. స్టూడెంట్ గా ఉన్నప్పుడు చేసిన రాజకీయాలు.. మంత్రిగా, ముఖ్యమంత్రిగా చేస్తే ఫ్యాక్షనిస్టులు అవుతారని, పదవిని అనుసరించి స్వభావాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంటుందని ఈ సందర్భంగా చంద్రబాబు అభిప్రాయపడ్డారు.