Andhra Pradesh: ఏపీ సీఎస్ కు కేంద్ర హోంశాఖ నుంచి పిలుపు!
- విభజన హామీలపై కేంద్రంలో కదలిక
- ఈనెల 23న ఢిల్లీ రావాలని ఏపీ సీఎస్ కు ఆదేశం
- తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా ఆహ్వానం
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు, ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విభజన హామీల అంశంపై కేంద్రంలో కదలిక వచ్చింది. విభజన హామీలపై చర్చించేందుకు సమగ్ర సమాచారంతో ఈనెల 23న ఢిల్లీకి రావాలని ఏపీ సీఎస్ కు కేంద్ర హోంశాఖ నుంచి కబురు వచ్చింది. ఈ సమావేశం ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకు జరుగనుంది.
కాగా, ఈ సమావేశంలో ప్రధానంగా విశాఖ రైల్వే జోన్, కడప స్టీల్ ఫ్యాక్టరీ, రెవెన్యూ లోటు, దుగరాజపట్నం పోర్టు, 9, 10వ షెడ్యూల్ సంస్థల విభజన తదితర అంశాలపై చర్చ జరగనుంది. అలాగే, సంస్థల విభజనపై చర్చ జరుగుతున్నందున ఈ సమావేశానికి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కూడా ఆహ్వానించారు.