Congress: హైదరాబాద్ ను కేసీఆర్ సర్వనాశనం చేస్తున్నారు: వీహెచ్
- హైదరాబాద్ అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది శూన్యం
- తెలంగాణకు జరిగిన అన్యాయం కవితకు కనబడట్లేదా?: వీహెచ్
- బోదకాలు బాధితులకు కాంగ్రెస్ హయాంలోనే పెన్షన్ ఇచ్చాం
- పక్షవాతం వచ్చిన వారికీ పెన్షన్ వర్తింపజేయాలి : జీవన్ రెడ్డి
హైదరాబాద్ ను కేసీఆర్ సర్వనాశనం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరిన ఎంపీ కవితకు, తెలంగాణకు జరిగిన అన్యాయం కనబడట్లేదా? బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఐఐఎం, హైకోర్టు విభజన వంటి అంశాలు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది శూన్యమని విమర్శించారు.
కాగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో సీనియర్ నేత జీవన్ రెడ్డి మాట్లాడుతూ, బోదకాలు బాధితులకు కాంగ్రెస్ హయాంలోనే పెన్షన్ ఇచ్చామని, ఇప్పుడు, దానినే టీఆర్ఎస్ ప్రభుత్వం పునరుద్ధరిస్తోందని అన్నారు. పక్షవాతం వచ్చిన వారికి కూడా పెన్షన్ వర్తింపజేయాలని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా పెన్షన్లను రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చారు.