Telangana: ఆంధ్రా ఎంపీల ఆందోళనకు మద్దతు తెలిపిన టీఆర్ఎస్ ఎంపీ కేకే
- రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను తక్షణం అమలు చేయాలి
- మేమెవ్వరం అభ్యంతరం చెప్పడం లేదు
- తెలంగాణకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిగా అమలు కాలేదు
- రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావు
ఏపీకి జరిగిన అన్యాయంపై పార్లమెంట్ లో టీడీపీ, వైసీపీ ఎంపీల నిరసనకు టీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావు (కేకే) తమ మద్దతు తెలిపారు. ఈరోజు రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు, తామెవ్వరం అభ్యంతరం చెప్పడం లేదని అన్నారు. తెలంగాణకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిగా అమలు కాలేదని, నీటి పంపకాల్లో తెలంగాణకు న్యాయం జరగలేదని, ఏపీకి ఒక న్యాయం, తెలంగాణకు మరో న్యాయం అన్నట్లు చూడటం సరికాదని అన్నారు.
ఏపీ అవసరాలను, అలాగే, తెలంగాణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నీటి పంపకాలు ఉండాలని, కాళేశ్వరం ప్రాజెక్ట్ కు కేంద్ర ప్రభుత్వం నిధులివ్వాలని కోరారు. ఏపీకి న్యాయం జరిగేందుకు తాము మద్దతిస్తామని, ఏపీ నేతలు ఆందోళన చేస్తుంటే ఆర్థిక మంత్రి జైట్లీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వెల్ లోకి వచ్చిన వారిని సస్పెండ్ చేసే విషయంలో వివక్ష తగదని, ఒకరిని సస్పెండ్ చేసి మరొకరిని అనుమతిస్తారా? ఇదేమి విధానం? అని ప్రశ్నించారు.