Andhra Pradesh: ఎంపీలూ.. రేపు కూడా ఆందోళన కొనసాగించండి: సీఎం చంద్రబాబు
- ఎంపీల ఆందోళనపై చంద్రబాబుకు నివేేదిక ఇచ్చిన పార్టీ నేతలు
- స్పష్టమైన హామీ వచ్చే వరకూ వెనక్కి తగ్గొద్దు
- రేపు కూడా ఆందోళన బాట పట్టమని చంద్రబాబు ఆదేశం
రేపు కూడా టీడీపీ ఎంపీలు ఆందోళనలు కొనసాగించాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారు. పార్లమెంట్ ఉభయసభల్లోనూ టీడీపీ ఎంపీలు ఈరోజు ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. దీనిపై ఓ నివేదికను చంద్రబాబుకు ఎంపీలు సమర్పించారు. రాజ్యసభలో అరుణ్ జైట్లీ, పీయూష్ గోయల్ స్పందనలను ఆయనకు వివరించారు. ఈ నేపథ్యంలో ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
కేంద్రం నుంచి స్పష్టమైన హామీ వచ్చేంత వరకూ వెనక్కి తగ్గొద్దని, ఆందోళనలు కొనసాగించాలని చంద్రబాబు చెప్పినట్టు సమాచారం. కాగా, ఏపీకి జరిగిన అన్యాయంపై ఉభయసభల్లోనూ టీడీపీ ఎంపీలు తమ నిరసనలు వ్యక్తం చేశారు. అన్ని సమస్యలు పరిష్కరిస్తామని, ఆందోళన విరమించాలని కేంద్ర మంత్రి సుజనా చౌదరికి ప్రధాని మోదీ ఈరోజు సూచించారు. అయితే, తమ పార్టీ అధినేత సూచన మేరకు నిర్ణయం తీసుకోవడం ఉంటుందని మోదీకి సుజనా స్పష్టం చేశారు.