Jagan: చంద్రబాబు ఓటుకు మూడు వేలు ఇస్తారు.. తీసుకోండి!: జగన్
- ఆ డబ్బు మనది, మనల్ని దోచేసి సంపాదించిన డబ్బు
- ఆ డబ్బు తీసుకొని ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్పండి
- చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో నిజాయతీ అన్న పదం రావాలి
- అందుకు మీ సహకారం కావాలి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాయమాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి వచ్చే ఎన్నికల్లో తమకే ఓటు వేయాలని అడుగుతారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇప్పటివరకు ఎన్నో మాయమాటలు చెప్పిన తనను ప్రజలు ఇక నమ్మబోరని చంద్రబాబు భావించే అవకాశం కూడా ఉందని, అందుకే ఓటు వేయమని డబ్బులు ఇస్తారని వ్యాఖ్యానించారు.
ఈ రోజు నెల్లూరులోని బుచ్చిరెడ్డి పాలెంలో పాదయాత్ర చేస్తోన్న జగన్ మాట్లాడుతూ.. 'డబ్బిస్తారు వద్దని చెప్పకండి తీసుకోండి, చంద్రబాబు ఓటుకు మూడు వేలు ఇస్తారు తీసుకోండి. కారణం ఏంటో తెలుసా?.. ఆ డబ్బు మనది, మనల్ని దోచేసి సంపాదించిన డబ్బు. కానీ, ఆ డబ్బు తీసుకొని ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్పండి. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో నిజాయతీ అన్న పదం రావాలి. రాజకీయాల్లో నిజాయతీ రావాలంటే ఒక్క జగన్ తోనే అయ్యే పని కాదు. మీ అందరి తోడు కావాలి. దేవుడి దయ వల్ల వచ్చే ఎన్నికల తరువాత మన ప్రభుత్వం వస్తే ప్రతి పేదవాడు, రైతుల ముఖంలో చిరునవ్వులు చూస్తాం' అని జగన్ అన్నారు.