Telugudesam: చంద్రబాబు ఏం చెబుతారోనని తీవ్ర ఉత్కంఠ!
- ప్రారంభమైన టీడీపీ కీలక సమావేశం
- బీజేపీతో పొత్తుపై సాగుతున్న చర్చ
- ఆయన నిర్ణయమే ఫైనలంటున్న టీడీపీ నేతలు
బడ్జెట్ లో ఏపీకి జరిగిన అన్యాయంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, కొద్దిసేపటి క్రితం అమరావతిలో కీలకమైన సమావేశాన్ని ప్రారంభించారు. బీజేపీతో ఇంకా కలిసుండాలా? తెగదెంపులు చేసుకోవాలా? అన్న అంశంపైనే చంద్రబాబు, ఎంపీలు, మంత్రులతో చర్చించనుండగా, చర్చల అనంతరం చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారోనన్న తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
పేరుకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ సాగుతుందని చెబుతున్నా, విభజన చట్టాన్ని సక్రమంగా అమలు చేయక పోవడం, కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేరక పోవడంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఎలా తగ్గించాలన్న విషయంపైనే వాడివేడిగా చర్చలు సాగుతున్నట్టు తెలుస్తోంది. ఇక టీడీపీ నేతలు ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతూ ఉండటాన్ని కూడా చంద్రబాబు తీవ్రంగానే పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది. నేతలంతా చెబుతున్న ఒకటే మాట ఏంటంటే, తమ అధినేత చంద్రబాబు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని. దీంతో ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్న అంశంపై రాష్ట్ర ప్రజలతో పాటు కేంద్రంలోనూ ఉత్కంఠ నెలకొంది.