Andhra Pradesh: రాజీనామా చేద్దామంటున్న టీడీపీ ఎంపీలు, బీజేపీతో పొత్తు వద్దంటున్న మంత్రులు!
- నేడు ఎంపీలు, ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశం
- ఇక బీజేపీతో తెగదెంపులేనంటున్న టీడీపీ వర్గాలు
- చంద్రబాబు తీసుకునే నిర్ణయంపై సర్వత్ర ఆసక్తి
బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర అన్యాయం జరిగిందని భావిస్తున్న తెలుగుదేశం ఎంపీలు రాజీనామా చేసేందుకు సిద్ధపడి, ఆ విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబు వద్ద చెప్పినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ ఉదయం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలపై అనుసరించాల్సిన వ్యూహాల గురించి, ఎంపీలు, ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశం కానుండగా, ఇప్పటికే పలువురు ఎంపీలు, మంత్రులు తమ అభిప్రాయాలను ఆయనకు చేరవేసినట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి.
ఎంపీ పదవులకు రాజీనామా చేస్తే, ప్రజల్లో ప్రతిష్ఠ పెరుగుతుందని కొందరు చంద్రబాబుకు స్పష్టం చేశారని, బీజేపీతో పొత్తు వద్దని, వెంటనే తెగదెంపులు చేసుకుందామని అత్యధిక మంత్రులు అంటున్నారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. కాగా, నేటి సమావేశంలో చంద్రబాబుతో పాటు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, మంత్రులు యనమల, అచ్చెన్నాయుడు తదితరులతో పాటు ఎంపీలంతా పాల్గొననుండగా, నేడు కీలక నిర్ణయం వెలువడుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారా అన్న విషయమై సర్వత్ర ఆసక్తి నెలకొంది.