Chandrababu: రాజస్థాన్ లో ఏమైందో చూశారుగా?: బీజేపీకి చంద్రబాబు హెచ్చరిక
- పాలన బాగా లేకుంటే ఎవరికైనా ఓటమే
- రెండు సిట్టింగ్ స్థానాలను బీజేపీ కోల్పోయింది
- మిగతా చోట్ల అదే పరిస్థితి తెచ్చుకోవద్దు
- హెచ్చరించిన చంద్రబాబునాయుడు
పరిపాలన సక్రమంగా లేకుంటే ఏ ప్రభుత్వాన్నీ ప్రజలు అంగీకరించరని, బీజేపీ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హెచ్చరించారు. ఈ ఉదయం అమరావతిలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం వాడి వేడిగా మొదలైంది. రాజస్థాన్ రాష్ట్రంలో రెండు సిట్టింగ్ ఎంపీ స్థానాలను అధికారంలో ఉండి కూడా బీజేపీ కోల్పోయిన విషయాన్ని ప్రస్తావించిన చంద్రబాబు, మిగతా ప్రాంతాల్లోనూ బీజేపీకి అదే పరిస్థితి రాకుండా చూసుకోవాలని సూచించారు.
రాష్ట్ర విభజన నాటి పరిస్థితులను కమిటీ ముందు ప్రస్తావించిన ఆయన, రాష్ట్రానికి అన్యాయం చేసినందునే కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయిందని అన్నారు. తెలంగాణను రాష్ట్రంగా చేస్తే కాంగ్రెస్ పక్షాన నిలుస్తానని ఆనాడు కేసీఆర్ చెప్పారని, ఏపీలో జగన్ తో డీల్ కుదుర్చుకున్నారని ఆరోపించిన ఆయన, రెండు రాష్ట్రాల్లోనూ తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేందుకు విభజన ప్రణాళికలను రచించారని అన్నారు. తాను ఒక్కడినే రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు న్యాయం చేయాలని పట్టుబట్టానని గుర్తు చేశారు. కేంద్రంతో సత్సంబంధాలుంటేనే రాష్ట్రానికి ఉపయోగం జరుగుతుందన్న ఉద్దేశంతోనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని, అదే జరుగకుంటే ఎలాంటి నిర్ణయానికైనా సిద్ధమేనని చెప్పారు.