Vijayawada: రూ. 30 లక్షల విద్యుత్ ను ఆదా చేసి రికార్డు సృష్టించిన విజయవాడ రైల్వే స్టేషన్

  • సంప్రదాయ లైట్ల స్థానంలో ఎల్ఈడీ బల్బులు
  • ఫైవ్ స్టార్ రేటింగ్ ఫ్యాన్లు, ఇన్వర్టర్ ఏసీలు
  • గణనీయంగా తగ్గిన విద్యుత్ వాడకం
  • 4.19 లక్షల యూనిట్ల విద్యుత్ ఆదా

విద్యుత్ వాడకాన్ని గణనీయంగా తగ్గించుకోగలిగిన విజయవాడ రైల్వే స్టేషన్ అధికారులు, రూ. 30,65,028 ఆదా చేసి రికార్డు సృష్టించారు. రైల్వే స్టేషన్ లోని ప్లాట్ ఫామ్ లు, బయటి ప్రాంతాల్లో ఉన్న 2,716 సంప్రదాయ లైట్ల స్థానంలో 2,574 ఎల్ఈడీ లైట్లను బిగించడంతో పాటు ప్లాట్ ఫారాలపై ఉన్న ఫ్యాన్ల స్థానంలో 676 ఫైవ్ స్టార్ రేటింగ్ ఫ్యాన్లను, 13 నాన్ స్టార్ ఏసీల స్థానంలో ఇన్వర్టర్ ఏసీలను బిగించడం వల్ల మొత్తం 4.19 లక్షల యూనిట్ల విద్యుత్ ను ఆదా చేశామని అధికారులు వెల్లడించారు.

ముఖ్యంగా ఎల్ఈడీ బల్బులను అమర్చడం ఫలితాలను ఇచ్చిందని అధికారులు తెలిపారు. ఇక రాజమండ్రి రైల్వే స్టేషన్ లో విద్యుత్ ఉపకరణాల రీప్లేస్ మెంట్ తరువాత 51 వేలకు పైగా యూనిట్లు ఆదా కాగా, రూ. 3.73 లక్షల మేరకు బిల్లు తగ్గింది. సత్ఫలితాలు రావడంతో, అన్ని ముఖ్యమైన స్టేషన్లలోనూ ఇదే విధానాన్ని అవలంబించాలని నిర్ణయించినట్టు రైల్వే అధికారులు వెల్లడించారు.

More Telugu News