Chandrababu: సక్రమంగా పనిచేస్తే 15% వృద్ధి సాధించడం సులభమే : ముఖ్యమంత్రి చంద్రబాబు

  • నీరు - ప్రగతి, వ్యవసాయంపై టెలికాన్ఫరెన్స్ 
  • 15% వృద్ధి, 80% ప్రజా సంతృప్తి లక్ష్యంగా అందరూ పనిచేయాలి
  • ‘జన్మభూమి’లో వచ్చిన వినతుల పరిష్కారంపై శ్రద్ధ చూపిన అధికారులు, సిబ్బందిని అభినందించిన చంద్రబాబు

సక్రమంగా పని చేస్తే 15% వృద్ధి సాధించడం సులభమేనని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి నీరు-ప్రగతి, వ్యవసాయం పురోగతిపై ఈరోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది తొలి అర్ధసంవత్సరంలో 11.5% వృద్ధి సాధించామని, 62% ప్రజల్లో సంతృప్తికి చేరుకున్నామని, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని అన్నారు. 15% వృద్ధి, 80% ప్రజా సంతృప్తి లక్ష్యంగా అందరూ పనిచేయాలని ఆదేశించారు.

గత నెలలో 5% సంతృప్తి ప్రజల్లో  పెరిగిందని, ఏప్రిల్ నాటికి మరో 5% సంతృప్తి చెందేలా అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు పని చేయాలని కోరారు. పెన్షన్లపై సంతృప్తి గత నెలలో ఉన్నట్లే 79% ఉండగా, ఈనెలలో రేషన్ పై సంతృప్తి 69% నుంచి 76%కు పెరగడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ‘జన్మభూమి’లో వచ్చిన వినతుల పరిష్కారంపై శ్రద్ధ చూపిన అధికారులు, సిబ్బందిని అభినందించారు. జనవరి 31లోపు వినతులన్నీ పరిష్కారం అయ్యేలా కృషిచేయాలన్నారు.

ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఏపీ ప్రకృతి వ్యవసాయం

ఇటీవల జరిగిన దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో ‘వ్యవసాయం-ఆహార భద్రత’పై ఫలప్రదమైన చర్చ జరిగిందని చంద్రబాబు తెలిపారు. పెట్టుబడులు లేని ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ నమూనా ప్రపంచ దృష్టిని ఆకర్షించిందని చెప్పారు. ప్రపంచంలో మేలైన విధానాలు, మెరుగైన పద్ధతులను అధ్యయనం చేసి వాటిని రాష్ట్రానికి తెస్తున్నామని అన్నారు. ‘సకాలంలో సాగునీరు అందించాం, తొలకరికే సేద్యం పనులు ప్రారంభించామని, అందుకే పంట దిగుబడులు పెంచగలిగామని అన్నారు.

ఈ ఏడాది వర్షాభావాన్ని అధిగమించి రాయలసీమ రైతాంగానికి సాగునీరు అందించడం సంతృప్తిగా ఉందని అన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఈ ఏడాది వేరుశనగ దిగుబడులు గణనీయంగా పెరిగాయంటూ వేరుశనగ, మినుము, అపరాల రైతులకు మద్దతు ధర లభించేలా చూడాలని, పెరుగుతున్న పంట దిగుబడుల దృష్ట్యా జిల్లాలలో గోడౌన్ల అందుబాటుపై కలెక్టర్లు శ్రద్ధ వహించాలని, ఎక్కడెక్కడ ఎంత విస్తీర్ణంలో గోడౌన్ల సదుపాయం ఉందో, ఎంత పెంచవచ్చో నివేదిక రూపొందించాలని ఆదేశించారు.

ఆక్వాలో కాలుష్యం బెడదను పూర్తిగా నిర్మూలించాలని, కాలుష్యం కారణంగా మన ఆక్వా ఉత్పత్తులకు ఉన్న ప్రాధాన్యత తగ్గే ప్రమాదం ఉందంటూ అజాగ్రత్తగా ఉంటే వృద్ధిరేటుపై గణనీయ ప్రభావం చూపుతుందని చంద్రబాబు హెచ్చరించారు. అజాగ్రత్తగా ఉన్నచోట వెనుకబడుతున్నామని, జాగ్రత్తగా ఉన్న చోట ముందంజలో ఉన్నామని సోదాహరణంగా ఆయన వివరించారు.

పేదల సొంతింటి కల నిజం చేయాలి

సొంత ఇల్లు ఉండాలన్న ఆలోచన అందరిలో ఉంటుందని, వారి కల నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై  ఉందని చంద్రబాబు అన్నారు. 2016-17 ఎన్టీఆర్ గ్రామీణ్ ఇళ్ల నిర్మాణం 64%మాత్రమే చేశారంటూ 100% లక్ష్యం చేరుకోవాలని ఆదేశించారు. 2017-18, 2018-19 ఇళ్ల కేటాయింపులు వేగవంతం చేయాలని, ఫిబ్రవరిలో రెండో విడత సామూహిక గృహ ప్రవేశాలు పండుగగా నిర్వహించాలని ఆదేశించారు. అంగన్ వాడి భవనాల నిర్మాణం వేగవంతం చేయాలని, నిర్మించిన ప్రతి అంగన్ వాడి భవనాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

నరేగాతో అటు ఉపాధి..ఇటు ఆస్తుల కల్పన జరుగుతోంది ఏపీ లోనే 

ఇతర రాష్ట్రాలలో ఉపాధికి మాత్రమే నరేగా వినియోగిస్తున్నారని, మన రాష్ట్రంలో అటు ఉపాధి, ఇటు ఆస్తుల కల్పనకు నరేగా నిధులు సద్వినియోగం చేసుకుంటున్నామని చంద్రబాబు అన్నారు. పంటకుంటల తవ్వకంలో మొదటిస్థానంలో ఉన్నామని, నరేగా నిధుల వ్యయంలో 3వ స్థానంలో ఉన్నామని వివరించారు. పనిదినాల సంఖ్య మరింతగా పెంచుకోవాలని ఈ సంద ర్భంగా చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. జియో ట్యాగింగ్ చేశాకే నరేగా పనులను ప్రారంభించాలని, లేకపోతే ఇబ్బందులు వస్తాయని హెచ్చరించారు. మెటీరియల్ కాంపోనెంట్ పనులు ఎక్కువ జరిగిన జిల్లాలలో లేబర్ కాంపోనెంట్ పెంచుకోవాలని, అవెన్యూ ప్లాంటేషన్ లో నాటిన మొక్కల పెరుగుదలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చంద్రబాబు ఆదేశించారు.
                             

  • Loading...

More Telugu News