Chandrababu: దళిత మహానాయకులు పుట్టిన నెలలోనే నేనూ పుట్టడం నా అదృష్టం!: సీఎం చంద్రబాబు
- దళిత తేజం - తెలుగుదేశం’ ప్రారంభించిన బాబు
- దళితుల్లో చైతన్యం తెచ్చేందుకే ఈ కార్యక్రమం
- వారి కోసం నా జీవితం అంకితం చేస్తానన్న ముఖ్యమంత్రి
దళిత మహానాయకులు పుట్టిన నెలలోనే తాను కూడా పుట్టడం తన అదృష్టమని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ‘దళిత తేజం - తెలుగుదేశం’ కార్యక్రమాన్ని ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘దళిత తేజం - తెలుగుదేశం’ కార్యక్రమ పోస్టర్లు, బ్రోచర్ లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దళితుల్లో చైతన్యం తెచ్చేందుకే, వారిని ఆకర్షించడమే లక్ష్యంగా ఈ భారీ కార్యక్రమాన్ని ప్రారంభించామని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితవాడల్లోని ప్రతి గడప వద్దకు టీడీపీ శ్రేణులు వెళతాయని అన్నారు.
దళితుల్లో ఐకమత్యం ఉండాలని, దళితుల కోసం తన జీవితం అంకితం చేస్తానని చెప్పారు. గణతంత్ర దినోత్సవం రోజున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం తనకు చాలా సంతోషంగా ఉందని, దళితులకు టీడీపీ ఎప్పుడూ సముచిత స్థానం కల్పిస్తూనే ఉందని అన్నారు. దళితులకూ రూ. 40 వేల 'చంద్రన్న పెళ్లి కానుక'లు ఇస్తున్నామని, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇస్తున్నామని అన్నారు. ఎస్పీ యువకులను పారిశ్రామికులుగా తీర్చిదిద్దేలా పథకాలు ప్రారంభించామని, అంబేద్కర్ స్మృతి వనంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.