Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో.. బయోటెక్నాలజీ, ఫార్మా రంగాలలో ఉపాధి కోసం ‘ప్రత్యంచ’ పేరిట శిక్షణ కార్యక్రమం!
- ఏపీ ఎస్ఎస్ డీసీ ఆధ్వర్యంలో ‘ప్రత్యంచ’ శిక్షణ
- గుంటూరు, కర్నూలు, అనంతపురం, తిరుపతి, కడపలలో శిక్షణ
- ప్రత్యేక కార్యక్రమం గుంటూరులో ప్రారంభం
ఇప్పటికే ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచేందుకు రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు అనేక రంగాల్లో నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్ డీసీ) చేపడుతోంది. అందులో భాగంగా భవిష్యత్తులో బయోటెక్నాలజీ, ఫార్మా రంగాలలో మెరుగైన ఉపాధి అవకాశాలు కలిగించేలా ఎపిఎస్ఎస్ డీసీ ‘ప్రత్యంచ’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది.
ఫార్మా, బయోటెక్నాలజీ రంగాల్లో ఉపాధి అవకాశాలను మరింత మెరుగుపరిచేందుకు ప్రత్యేక కార్యాచరణను ప్రారంభించింది. గుంటూరులోని చలపతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూటికల్ సైన్సెస్ కాలేజీలో ఈ కార్యక్రమాన్ని ఏపీ ఎస్ఎస్ డీసీ ఎండి, సీఈవో సాంబశివరావు ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యంచ పేరుతో ఏపీ ఎస్ఎస్ డీసీ చేపడుతున్న శిక్షణా కార్యక్రమాల ద్వారా ఫార్మా, బయోటెక్నాలజీ రంగాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు. భవిష్యత్తులో బయోటెక్నాలజీ, ఫార్మా రంగాల హబ్ గా ఏపీ ఉండనుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కాపీ రైట్స్ డాక్టర్. ఎ. రవిశంకర్, గోదావరి నాలెడ్జ్ సొసైటీ చైర్మన్, అడ్వైజరీ బోర్డు మెంబర్, రిటైర్డ్ ఐఏఎస్ ఎం.గోపాలకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
సంయుక్త నిర్వహణలో ‘ప్రత్యంచ’
లైఫ్ సైన్స్ సెక్టార్ స్కిల్ డెవలప్ మెంట్ కౌన్సిల్ (ఎల్ఎస్ఎస్ఎస్డీసీ), సిఎస్ఐఆర్-ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంస్థలతో కలిసి ఏపీీఎస్ఎస్ డీసీ సంయుక్తంగా ‘ప్రత్యంచ’ను నిర్వహిస్తున్నాయి. గుంటూరుతో పాటు కర్నూలు, అనంతపురం, తిరుపతి, కడపలో కూడా ఈ శిక్షణా కార్యక్రమాలను చేపడుతోంది. బయోటెక్నాలజీ, ఫార్మారంగాలకు అవసరమైన నైపుణ్యం గల అభ్యర్థులను తయారు చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం. ఇందులో భాగంగా అనుభవజ్ఞులైన అధ్యాపకులతో థియరీ విభాగంలో శిక్షణ ఇస్తారు. ప్రాక్టికల్స్ శిక్షణను హైదరాబాద్ లోని ఐఐసిటీలో ఇస్తారు. కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేస్తారు.
ఈ శిక్షణకు అర్హతలు
బీటెక్ ఫైనల్ ఇయర్, ఎంటెక్, ఎమ్మెస్సీ విద్యను అభ్యసించిన వారితోపాటు ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా ‘ప్రత్యంచ’ ప్రోగ్రామ్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కొక్క అభ్యర్థి శిక్షణకు లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం రూ. 80 వేలు సబ్సిడీగా ఇస్తుంది. మిగిలిన రూ.20 వేలు శిక్షణ పొందే అభ్యర్థులు చెల్లించాల్సి ఉంటుంది. శిక్షణ అనంతరం అభ్యర్థులకు ఉద్యోగాలు లభించేలా చర్యలు తీసుకుంటారు.