Telangana: గవర్నర్ ను టీఆర్ఎస్ ఏజెంట్ అనడం నీచరాజకీయం: మంత్రి హరీష్ రావు
- కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డ హరీష్ రావు
- మమ్మల్ని ఎవరు మెచ్చుకున్నా టీఆర్ఎస్ ఏజెంట్లేనా?
- కేంద్ర జల సంఘం సభ్యులు, గడ్కరీ కూడా ఏజెంట్లేనా?
- గవర్నర్ నరసింహన్ కు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి
కాళేశ్వరం ప్రాజెక్టు పనులు బాగా జరుగుతున్నాయంటూ సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావుపై గవర్నర్ నరసింహన్ ప్రశంసలు కురిపించడంపై కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి హరీష్ రావు స్పందిస్తూ, గవర్నర్ ను టీఆర్ఎస్ ఏజెంట్ అనడం నీచరాజకీయమని మండిపడ్డారు. గవర్నర్ హోదాను కాంగ్రెస్ పార్టీ నేతలు అప్రతిష్టపాలు జేస్తున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టుని గవర్నర్ సందర్శించి అక్కడ జరుగుతున్న పనులపై ప్రశంసించడాన్ని కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు.
‘మమ్మల్ని ఎవరు మెచ్చుకున్నా టీఆర్ఎస్ ఏజెంట్లేనా? కేంద్ర జల సంఘం సభ్యులు, గడ్కరీ కూడా ఏజెంట్లేనా? రూ.5 భోజనం బాగుందంటే జానారెడ్డిని టీఆర్ఎస్ ఏజెంట్ అన్నారు! తెలంగాణలో గొర్రెల పథకాన్ని మెచ్చుకున్నందుకు కర్ణాటక మంత్రి రేవణ్ణను టీఆర్ఎస్ ఏజెంట్ అన్నారు! గవర్నర్ నరసింహన్ కు రాజకీయాలు అంటగట్టడం తగదు. ఆయనకు తక్షణం బేషరతుగా క్షమాపణలు చెప్పాలి’ అని హరీష్ రావు డిమాండ్ చేశారు.