Chandrababu: చంద్రబాబులా ఏ సీఎం కూడా ఈ స్థాయిలో కేంద్రాన్ని అభ్యర్థించడం లేదు: టీడీపీ ఎంపి అవంతి శ్రీనివాస్
- విభజన చట్టం హామీల అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలి
- రాజధాని నిర్మాణానికి రూ.3 వేల కోట్లిస్తారా?
- టీడీపీ వర్క్ షాప్ లో చంద్రబాబు ముందు తన అభిప్రాయాలను వ్యక్తపరిచిన అవంతి
విభజన చట్టం హామీల అమలు విషయమై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో ఈరోజు ఉదయం ప్రారంభమైన ఒకరోజు టీడీపీ వర్క్ షాప్ కొంచెం సేపటి క్రితం ముగిసింది. విభజన చట్టం హామీల అమలు విషయమై చర్చ జరిగింది. ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఎంత బాధ్యత ఉందో బీజేపీకి కూడా అంతే బాధ్యత ఉందని, కేంద్రంపై ఒత్తిడి పెంచాలని, ఏ సీఎం కూడా ఈ స్థాయిలో కేంద్రాన్ని అభ్యర్థించడం లేదని అన్నారు.
రైతులు భూములు ఇచ్చారు కాబట్టి పరిపాలన చేయగలుగుతున్నామని, రూ.11,600 కోట్ల విలువైన భూములను కేంద్ర విద్యా సంస్థకు ఇస్తే, పరిహారం కింద కేవలం కేంద్రం రూ.150 కోట్లు ఇస్తుందా? అని ప్రశ్నించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.30 వేల కోట్లు ఖర్చవుతుంటే, కేవలం రూ.3 వేల కోట్లిస్తారా? అంటూ టీడీపీ వర్క్ షాప్ లో చంద్రబాబు ముందు తన అభిప్రాయాలను ఆయన వ్యక్తపరిచారు.