arjun reddy: అందుకే, ‘అర్జున్ రెడ్డి’లో వచ్చిన అవకాశాన్ని వదులుకున్నా: హీరోయిన్ పార్వతి నాయర్

  • హీరో, దర్శకుడు కొత్త వ్యక్తులని భావించా
  • కథలో ముద్దు సీన్లు, శ్రుతిమించిన సన్నివేశాలు
  • సినిమా విడుదలైన తర్వాత చూశా
  • నటించనందుకు చాలా బాధపడ్డా: పార్వతి నాయర్

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి చిత్రం గత ఏడాది విడుదలైన విషయం తెలిసిందే. హీరో విజయ్ దేవరకొండకు, దర్శకుడు సందీప్ రెడ్డి కి పేరు సంపాదించి పెట్టిన ఈ చిత్రం కలెక్షన్ల పరంగానూ రికార్డులు సృష్టించింది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన షాలిని పాండే నటించింది. అయితే, షాలిని పాండే కంటే ముందు తమిళ తార పార్వతి నాయర్ ను ఆ పాత్రలో నటించాలని సందీప్ రెడ్డి అడిగారట. ఈ చిత్రం కథ అంతా విన్న తర్వాత నటించనని తాను చెప్పానని పార్వతి నాయర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

‘సందీప్ రెడ్డి నన్ను కలిసి కథ చెప్పారు. హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు సందీప్ రెడ్డి కొత్త వ్యక్తులని అనుకున్నా. దీనికి తోడు, ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు నాకు ఇబ్బందిగా అనిపించాయి. ముఖ్యంగా, ముద్దు సన్నివేశాలతో పాటు శ్రుతి మించిన సన్నివేశాలూ ఉన్నాయి. అందుకే, ఈ సినిమాలో నటించనని చెప్పేశా’ అని నాటి విషయాన్ని పార్వతి నాయర్ గుర్తుచేసుకుంది.

ఈ సినిమా కథ చదివినప్పుడు, విన్నప్పుడు సాధారణంగా ఉందని చెప్పిన పార్వతి నాయర్, కొత్త దర్శకుడు నైపుణ్యాన్ని గుర్తించలేకపోయానని చెప్పింది. ఈ సినిమాను తెరపై చూసిన తర్వాత దానిని వదులుకున్నందుకు చాలా బాధపడ్డానని చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా మరో సినిమాలో నటించలేకపోయిన విషయాన్ని ఆమె ప్రస్తావించింది. 2015లో వచ్చిన తమిళ సినిమా ‘అరువి’లో తనను నటించమని కోరారని, కథలో భాగంగా గుండు చేయించుకోవాలని చెప్పడంతో అప్పుడు  కూడా ‘నో’ అనాల్సి వచ్చిందని పార్వతి నాయర్ చెప్పింది.  

More Telugu News