Arun Jaitly: తాజా జీఎస్టీ సవరణల తరువాత ధరలు తగ్గనున్న వస్తువులివే!

  • 29 వస్తువులు, 54 సేవలపై తగ్గిన పన్ను
  • 25 నుంచి అమలులోకి రానున్న కొత్త ధరలు
  • జీఎస్టీ రిటర్నుల దాఖలు సులభం చేస్తామన్న జైట్లీ

ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్, 29 వస్తువులు, 54 సేవలపై ప్రస్తుతం ఉన్న పన్నును తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. జీఎస్టీ మండలి ఆదేశాల ప్రకారం మారిన ధరలు ఈ నెల 25 నుంచి అమలులోకి వస్తాయి. పాత వాహనాల విభాగంలో మధ్య, పెద్ద తరహా కార్లు, ఎస్యూవీలను విక్రయించే వ్యాపారులు లాభాలపై పన్నును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. ఆ వ్యాపారులు ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ సౌకర్యాన్ని వినియోగించుకోకుండా ఉంటేనే ఇది వర్తిస్తుందన్న నిబంధన విధించింది.

ఆయా వాహనాలకు ప్రస్తుతం 15 శాతం కాంపెన్ సేషన్ సెస్ ఉండగా, దాన్ని పూర్తిగా ఎత్తేసింది. మిగతా వాహనాలకు 28 శాతం నుంచి 12 శాతానికి పన్ను తగ్గించింది. పిల్లల చిరుతిళ్లలో భాగమైన మిఠాయిలు (షుగర్ బాయిల్డ్ కన్ఫెక్షనరీ)లపై, 20 లీటర్ల వాటర్ క్యాన్ లపై, ఎరువుల్లో ఉపయోగించే ఫాస్పారిక్ యాసిడ్ పై, జీవ ఇంధనం, జీవ ఎరువులు, వేపపూత ఉన్న ఎరువులు, నిమ్మగడ్డి, వెదురుతో చేసే భవన నిర్మాణ సామాగ్రి, బిందుసేద్యం పరికరాలు, మెకానికల్ స్ప్రేయర్లపై జీఎస్టీని 18 నుంచి 12 శాతానికి తగ్గిస్తున్నట్టు కౌన్సిల్ వెల్లడించింది.

ఇదే సమయంలో చింతపండు గింజల పొడి, మహిళలకు ప్రీతిపాత్రమైన కోన్ గోరింటాకు, ఇళ్లకు వంటగ్యాస్ సరఫరా చేసే ఎల్పీజీ, శాస్త్ర సాంకేతిక పరికరాలు, ఉపగ్రహాల్లో వాడే సామాగ్రి తదితరాలపై ప్రస్తుతమున్న 18 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గించింది. ఇక గడ్డి, కేన్ వంటి సామాగ్రితో తయారు చేసే పరికరాలు, వెల్ వెట్ వస్త్రాలపై 12 శాతం పన్నును 5 శాతానికి తీసుకు వచ్చింది. వజ్రాలు, ఇతర విలువైన రాళ్లపై 3 శాతం ఉన్న పన్నును 0.25 శాతానికి తగ్గించింది.

విభూది, వినికిడి పరికరాల విడిభాగాలు, నూనె తీసిన వరిధాన్యం తవుడుపై పన్నును పూర్తిగా తొలగించింది. అంబులెన్స్ లు, 10 నుంచి 13 సీట్లు ఉండే మినీ బస్సులపై కాంపెన్ సేషన్ సెస్ ను పూర్తిగా ఎత్తివేస్తున్నట్టు కౌన్సిల్ ప్రకటించింది. మెట్రో రైళ్ల నిర్మాణం, చిన్న తరహా ఇళ్లలో హౌస్ కీపింగ్, పార్కుల్లో ప్రవేశం వంటి సేవలపై పన్నును స్వల్పంగా తగ్గించింది. ఇక జీఎస్టీ రిటర్నుల దాఖలును మరింత సరళతరం చేస్తామని వెల్లడించిన అరుణ్ జైట్లీ, ఇందుకు సంబంధించిన విధి విధానాలను త్వరలోనే ఖరారు చేయనున్నామని తెలిపారు.

More Telugu News