: చికిత్స లేని క్యాన్సర్‌కు చిగురు తొడుగుతున్న ఆశలు
మానవ మేథ కు లొంగకుండా.. ఇంకా ప్రశ్నార్థకంగానే ఉన్న సమస్యలు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. నిర్దిష్టమైన చికిత్స, అంతుచిక్కని రోగాలు కూడా అందులో ఒకటి. అలాంటి తీవ్రమైన రోగాల్లో ఒకటైన రక్త క్యాన్సర్‌కు ... తాజాగా పరిశోధకులు కనుగొన్న ఒక యాంటీ బాడీ చికిత్స దిశగా ఆశలు రేకెత్తిస్తోంది. 'బీఐ 505'గా శాస్త్రవేత్తలు వ్యవహరిస్తున్న ఈ యాంటీబాడీ కణితి కణాల్ని హతమారుస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. స్వీడన్ లోని లండ్ యూనివర్సిటీ డాక్టర్ మార్కన్ హ్యాన్సన్ మాట్లాడుతూ ఈ యాంటీబాడీపై రకరకాల పరిశోధనలు చేసినట్లు చెప్పారు.
వీరు దీనిని రక్తక్యాన్సర్ కణితిలపై కూడా ప్రయోగించి చూశారు. రక్త క్యాన్సర్ కణాలైన మైలోమాను నాశనం చేసే శక్తి వీటికి ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. జంతువులపై చేసిన ప్రయోగాలు సత్పలితాలు ఇవ్వడంతో శాస్త్రవేత్తలు వ్యాధి తీవ్రంగా ఉన్న మనుషులపై కూడా ఈ యాంటీబాడీని పరీక్షించారు. ఆ అధ్యయనంలోనూ మంచి ప్రోత్సాహకర ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాలు ఇంకాస్త మెరుగ్గా వచ్చినట్లయితే.. బీఐ 505 మీద పరిశోధనలు ఇంకా ఊపందుకుంటాయి. వీటివల్ల రక్త క్యాన్సర్ చికిత్సలో భవిష్యత్తులో మంచి పరిణామాలు ఉంటాయని వారు ఆశిస్తున్నారు.