Andhra Pradesh: ఏపీ 'గ్రీన్ - 2017' అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం!
- ఏపీ పట్టణ పచ్చదనం, సుందరీకరణ కార్పోరేషన్ ఎండీ వెల్లడి
- మొత్తం 8 విభాగాలలో ఈ అవార్డులు
- మొత్తం 120 అవార్డులు
- దరఖాస్తులు పంపేందుకు చివరి తేదీ ఫిబ్రవరి 15
ఏపీ గ్రీన్ అవార్డులు - 2017కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పట్టణ పచ్చదనం, సుందరీకరణ కార్పోరేషన్ ఎండీ ఎన్.చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో ఈరోజు మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు ఏపీ గ్రీన్ అవార్డులు-2017 ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి ఏడాది ఈ విధంగా ఇవ్వాలని కూడా సీఎం ఆదేశించినట్లు చెప్పారు.
పచ్చదనాన్ని పెంపొందించడంలో విశేషంగా కృషి చేసిన వారికి ఈ అవార్డులు ఇస్తామని, మొత్తం 8 విభాగాలలో ఈ అవార్డులు ప్రకటిస్తారని అన్నారు. స్థానిక సంస్థలు, ప్రభుత్వ ఉద్యానవనాలు, పరిశ్రమలు, కార్పోరేట్ సంస్థలు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, ఆస్పత్రులు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయ ప్రాంగణాలు, గేటెడ్ కమ్యూనిటీ, అపార్ట్ మెంట్స్, ఇంటి ఉద్యానవనాలు, స్వచ్ఛంద సంస్థలు, పురాతన చెట్లు, వృక్ష సముదాయాల సంరక్షణలలో వేరువేరుగా మొత్తం 120 అవార్డులు అందజేస్తారని వివరించారు. జ్ఞాపిక, నగదు బహుమతితోపాటు సర్టిఫికెట్ అందజేస్తారని చెప్పారు. అర్బన్ గ్రీనింగ్ వెబ్ సైట్ నుంచి దరఖాస్తులు డౌన్ లోడ్ చేసుకొని ఆన్ లైన్ లేదా పోస్ట్ ద్వారా పంపవచ్చునని తెలిపారు. దరఖాస్తులు పంపేందుకు చివరి తేదీ ఫిబ్రవరి 15 గా పేర్కొన్నారు.
పచ్చదనం, సుందరీకరణ కోసం కృషి చేస్తున్నాం
రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనం, సుందరీకరణ కోసం తమ ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్ లు, ఉద్యానవన శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నట్లు ఎన్.చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో మొత్తం 4 జోనల్ కార్యాలయాలు ఉన్నట్లు తెలిపారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, విశ్వవిద్యాలయాలు, రహదారులు, దేవాలయాలు వంటి చోట్ల పచ్చదనం నింపేందుకు ల్యాండ్ స్కేప్ మాస్టర్ ప్లాన్లు అందజేస్తున్నట్లు వివరించారు. పచ్చదనం నింపడానికి సర్వే, డిజైన్, ఎస్టిమేషన్, ప్రాసెసింగ్ వంటి అంశాలలో తాము సహాయపడతామని చెప్పారు. తమ వద్ద ఉన్న ఆరుగురు ఆర్కిటెక్ట్ లతోపాటు 51 మంది బయటి వారు ఇందుకోసం పని చేస్తున్నట్లు తెలిపారు. అమృత పథకం కింద రాష్ట్రంలో 31 మున్సిపాలిటీలలో 151 పార్కులు అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.
18న ‘గ్రీన్ ఏపీ’ సాఫ్ట్ వేర్ ని ఆవిష్కరించనున్న సీఎం చంద్రబాబు
అమృత పథకానికి కేంద్ర ప్రభుత్వం 50 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం, స్థానిక సంస్థలు 30 శాతం నిధులు సమకూర్చుతాయని చంద్రమోహన్ రెడ్డి వివరించారు. మొక్కల రకాలు, వాటి ధరలు, వాటి రక్షణ, మందుల వాడకం తదితర అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రజలకు కూడా అన్ని రకాలుగా ఉచితంగా సహాయ సహకారాలు అందించడానికి ‘గ్రీన్ ఏపీ’ అనే సాఫ్ట్ వేర్ కూడా రూపొందించినట్లు తెలిపారు. ఈ సాఫ్ట్ వేర్ ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 18న ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు. మొక్కలు పెంచాలన్న ఆసక్తి ఉన్నవారు ‘గ్రీన్ ఏపీ’ అనే వెబ్ సైట్ లోకి వెళ్లి, తమ పేరు నమోదు చేసుకోవాలని, తద్వారా అవసరమైన సూచనలు, సలహాలు పొందవచ్చని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ పట్టణ పచ్చదనం, సుందరీకరణ కార్పోరేషన్ లో రీసెర్చ్ వింగ్ కూడా ఉన్నట్లు
చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ఈ విధమైన వింగ్ దేశంలో ఎక్కడా లేదన్నారు. పచ్చదనం, సందరీకరణకు తాము 688 డిజైన్లు రూపొందించినట్లు చెప్పారు. గార్డెనర్స్ కొరతను దృష్టిలో పెట్టుకొని ఆసక్తి ఉన్నవారికి నాలుగు నెలల శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.
నిర్మాణాలకు అడ్డుగా ఉన్న చెట్లను నరకకుండా వేరే చోటకు తరలించే కార్యక్రమం కూడా చేపట్టినట్లు తెలిపారు. విజయవాడ బెంజి సర్కిల్ వద్ద నిర్మించనున్న ఫ్లైఓవర్ కు అడ్డుగా ఉన్న 80 శాతం చెట్లను ఇతర ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. డ్రోన్ సర్వే ద్వారా పచ్చదనాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. పార్కుల అభివృద్ధి, మొక్కల పెంపకం, పచ్చదనం, సుందరీకరణకు త్వరలో అర్బన్ గ్రీన్ పాలసీని విడుదల చేయనున్నట్లు చంద్రమోహన్ రెడ్డి చెప్పారు.