modi: మోదీ 'వరల్డ్ నంబర్ 3'... ప్రపంచ నేతలపై ‘గాలప్’ సర్వే
- మొదటి స్థానంలో జర్మనీ చాన్స్ లర్ ఏంజెలా మెర్కెల్
- రెండో స్థానంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయేల్
- టాప్ టెన్ లో లేని ట్రంప్... ఆయనకు దక్కిన స్థానం 11
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ వీరందరూ మన ప్రధాని మోదీ కంటే వెనుకబడ్డారు. ఎందులో అనుకుంటున్నారా...? ప్రపంచ అత్యుత్తమ నేతల విషయంలో! ఈ విషయంలో నరేంద్ర మోదీ మూడో స్థానంలో నిలిచినట్టు గాలప్ ఇంటర్నేషనల్ అనే సంస్థ తన సర్వేలో తేల్చింది. ప్రపంచ వ్యాప్తంగా 50కుపైగా దేశాల్లో ప్రజల అభిప్రాయాలను సేకరించి వాటి ఆధారంగా గాలప్ నేతలకు ర్యాంకులు కేటాయించింది.
జర్మనీ చాన్స్ లర్ ఏంజెలా మెర్కెల్ మొదటి స్థానంలో నిలిచారు. ఆమె పట్ల 49 శాతం మంది సానుకూల అభిప్రాయాలను వ్యక్తీకరించారు. వ్యతిరేకంగా స్పందించింది కేవలం 29 శాతమే. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయేల్ మెక్రాన్ ద్వితీయ స్థానంలో ఉన్నట్టు ఈ సంస్థ వెల్లడించింది. మన ప్రధాని నరేంద్ర మోదీకి అనుకూలంగా 30 శాతం మంది స్పందించగా, వ్యతిరేకంగా అభిప్రాయం తెలిపిన వారు 22 శాతం. నాలుగో స్థానంలో బ్రిటన్ ప్రధాని థెరీసామే, ఐదో స్థానంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, ఆ తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉన్నారు. ఆ తర్వాత సౌదీ అరేబియా రాజు సల్మాన్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు, ఇరాన్ అధ్యక్షుడు రౌహానీ, టర్కీ అధ్యక్షుడు ఎర్డగాన్ ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు దక్కిన స్థానం 11. ఆయన పట్ల అనుకూలంగా ఉన్న వారు 31 శాతం అయితే ప్రతికూలంగా 58 శాతం ఉన్నట్టు గాలప్ తెలిపింది.